గులాబీ నేతకు కాషాయ కండువా: ఒక్కో సీట్ లో లక్ష ఓట్లు గ్యారెంటీ
Guvvala Balaraju: బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు, మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు.. భారతీయ జనతా పార్టీలో చేరారు. కొద్దిసేపటి కిందటే హైదరాబాద్ లోని బీజేపీ కేంద్ర కార్యాలయంలో పార్టీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు ఎన్ రామచందర్ రావు సమక్షంలో కాషాయ కండువాను కప్పుకొన్నారు. అనంతరం ప్రాథమిక సభ్యత్వాన్ని అందుకున్నారు.
ప్రత్యేక తెలంగాణ ఉద్యమ సమయంలో బీఆర్ఎస్ లో చేరారాయన. అనంతరం నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేట్ నియోజకవర్గం నుంచి బీఆర్ఎస్ అభ్యర్థిగా వరుసగా రెండుసార్లు పోటీ చేసి ఘన విజయం సాధించారు. 2014, 2018 ఎన్నికల్లో భారీ మెజారిటీతో అసెంబ్లీకి ఎన్నికయ్యారు.

2023 ఎన్నికల సమయంలోనూ ఆయనకు టికెట్ ఇచ్చింది బీఆర్ఎస్. ఆ ఎన్నికల్లో ఓడిపోయారు. తన సమీప ప్రత్యర్థి, కాంగ్రెస్ కు చెందిన చిక్కుడు వంశీ కృష్ణ చేతిలో పరాజయాన్ని చవి చూశారు. దాదాపుగా 50 వేల ఓట్ల తేడాతో గువ్వల బాలరాజును మట్టికరిపించారు వంశీ కృష్ణ.
దీని తరువాత బీఆర్ఎస్ లో ఆయన పెద్దగా క్రియాశీలకంగా వ్యవహరించలేదు. పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటూ వచ్చారు. జిల్లా స్థాయిలో నాయకులతోనూ పెద్దగా అంటీముట్టనట్టుగా వ్యవహరిస్తూ వచ్చారు. అదే సమయంలో బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు, మాజీ మంత్రి కేటీఆర్ పైనా తరచూ విమర్శలు గుప్పించడం ప్రాధాన్యతను సంతరించుకుంది.
దీనితో గువ్వల బాలరాజు.. బీఆర్ఎస్ కు గుడ్ బై చెబుతాడనే ప్రచారం ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా రాజకీయాల్లో విస్తృతంగా వినిపించింది. దీనికి అనుగుణంగా ఆయన ఇటీవలే బీఆర్ఎస్ కు రాజీనామా చేశారు. తాజాగా రామచందర్ రావు సమక్షంలో కాషాయ కండువా కప్పుకొన్నారు.
ఈ సందర్భంగా గువ్వల బాలరాజు మాట్లాడారు. అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్ఎస్ పై ఘాటు విమర్శలు చేశారు. వచ్చే అసెంబ్లీల సందర్భంగా ఈ రెండు పార్టీలు గల్లంతవుతాయని జోస్యం చెప్పారు. తెలంగాణలో ఒక్కో అసెంబ్లీ నియోజకవర్గంలో బీజేపీకి లక్ష ఓట్లు పడతాయని ధీమా వ్యక్తం చేశారు.












Click it and Unblock the Notifications