చెప్తే విన్లేదు, వాళ్లింటికే వెళ్లండి: షాకిచ్చిన హరీష్ రావు, తర్వాత చల్లబడ్డారు
హైదరాబాద్: పారిశుద్ధ్య కార్మికులకు తెలంగాణ రాష్ట్ర భారీ నీటి పారుదల శాఖ మంత్రి ఝలక్ ఇచ్చారు. వారి వద్దకే వెళ్లండని కార్మికులకు ముఖం మీదే చెప్పేశారు. ఎర్ర జెండవాళ్ల మాట విన్నారని, సమ్మె వద్దని సాక్షాత్తు ముఖ్యమంత్రి కెసిఆర్ వారించినా వినలేదని హరీష్ రావు అన్నారు.
ఉద్యోగాలు పోగొట్టుకున్నారని, ఇప్పుడు మేం ఏం చేస్తామని, వెళ్లి ఎర్ర జెండా వాళ్లనే అడగాలని, వారి ఇళ్ల వద్దే ధర్నాలు చేసుకోవాలని జీహెచ్ఎంసీ పారిశుద్ధ్య కార్మికులకు హరీశ్ రావు సూచించారు.
ఆదివారం ఆయన మెదక్ జిల్లా రామచంద్రాపురంలోని మాజీ ఎమ్మెల్సీ భూపాల్ రెడ్డి ఇంటికి వచ్చారు. విషయం తెలుసుకున్న కార్మికులు తమను ఉద్యోగాల్లోకి తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా హరీశ్ రావు స్పందించారు.
అధికారంలోకి వచ్చిన వెంటనే పారిశుద్ధ్య కార్మికులతో కలిసి చీపురు పట్టుకున్న ఘనత ఒక్క కేసీఆర్‌కే దక్కుతుందని, అలాగే పారిశుద్ధ్య కార్మికులను అన్నా నమస్తే అని పలకరించిందీ కేసీఆరేనని, సమ్మె విరమించుకోమని, వేతనాలు పెంచుతామని చెప్పినా వినకుండా సమ్మె చేశారన్నారు.
సీఎం మాట విని 20వేల మంది కార్మికులు సమ్మె విరమించి విధుల్లో చేరి ఉద్యోగాలు కాపాడుకున్నారని చెప్పారు. రెండు వేల మంది విపక్షాల మాట విని సమ్మె చేశారని, ఉద్యోగాలు పోగొట్టుకున్నారన్నారు. సీఎం ఇళ్లు కట్టిస్తానన్నా వినలేదన్నారు. ఎవరు చెప్పినా వినలేదన్నారు. అందుకే ఇలా జరిగిందన్నారు.
అయితే, వారి మాటలు నమ్మి మోసపోయామని, న్యాయం చేయాలని కార్మికులు మంత్రిని వేడుకున్నారు. దీంతో కాస్తంత శాంతించిన హరీశ్ రావు... ఈ విషయాన్ని సీఎం వద్దకు తీసుకెళ్లి పరిష్కరించేందుకు యత్నిస్తానని హామీ ఇచ్చారు.

కాంగ్రెస్ నేతల పైన హరీష్ రావు ఆగ్రహం
కాంగ్రెస్ నేతల ఆందోళనల పైన మంత్రి హరీష్ రావు సోమవారం స్పందించారు. తెలంగాణ ప్రాజెక్టులు, రైతుల పైన కాంగ్రెస్‌ది కపట ప్రేమ అన్నారు. ప్రాజెక్టుల డిజైన్ మార్పుతో ఎక్కువ ఆయకట్టుకు నీరు ఇచ్చే ప్రయత్నాలు చేస్తున్నామన్నారు. ప్రాణహిత ప్రాజెక్టు పైన మాట్లాడే హక్కు కాంగ్రెస్ పార్టీకి లేదన్నారు.
రంగారెడ్డి జిల్లా పైన కాంగ్రెస్ పార్టీది కపట ప్రేమే అన్నారు. దూరం, లిఫ్ట్‌లు, ఖర్చు తక్కువగా ఉండేలా ప్రాజెక్టుల డిజైన్ మార్చుతున్నట్లు చెప్పారు. రంగారెడ్డి జిల్లాలో 2.70 లక్షల ఎకరాలకు నీరు ఇవ్వాలని నిర్ణయించినట్లు చెప్పారు.
ఎర్రవెల్లిలో 285 డబుల్‌బెడ్‌రూం ఇళ్లు మంజూరు
మెదక్ జిల్లాలో రెండు పడక గదుల ఇళ్ల నిర్మాణానికి అనుమతులు మంజురయ్యాయి. ఎర్రవెళ్లిలో 285 రెండు పడక గదుల ఇళ్ల నిర్మాణానికి పారిపాలన అనుమతులు లభించాయి. గ్రామజ్యోతిలో భాగంగా ఎర్రవెల్లి గ్రామస్తులకు ముఖ్యమంత్రి కెసిఆర్ హామీ ఇచ్చారు. ఒక్కో ఇంటికి రూ.5.04 లక్షలు మంజూరు చేశారు.
తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!