ఆత్మహత్యలు నిజమే కానీ, లింబయ్యకి ఎయిడ్స్: హరీష్ అసహనం, 'కెసిఆర్‌ది జోకర్ పాలన'
హైదరాబాద్: రాజధాని నడిబొడ్డున ట్యాంక్ బండ్ పైన ఆత్మహత్య చేసుకున్న లింబయ్య మృతి విషయంలో విపక్షాల తీరు పైన మంత్రి హరీష్ రావు శుక్రవారం నాడు స్పందించారు. రైతు సమస్యల పైన తమ ప్రభుత్వం ప్రధానంగా దృష్టి సారించిందని చెప్పారు.
రాష్ట్రంలో రైతు ఆత్మహత్యలు నిజమేనని కానీ, ప్రతి దానిని రైతు ఆత్మహత్యగా చిత్రీకరించడం సరికాదని అభిప్రాయపడ్డారు. లింబయ్య ఆర్థికంగా బాగానే ఉన్నాడని చెప్పారు. గత కొంతకాలంగా ఆయన ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నట్లు చెప్పారు.
లింబయ్య ఎయిడ్స్‌తో బాధపడుతున్నాడని చెప్పారు. లింబయ్యకు, ఆయన భార్యకు, తల్లికి రూ.వెయ్యి చొప్పున ముగ్గురికి కూడా పింఛన్లు అందుతున్నాయని చెప్పారు. తమ ప్రభుత్వం రైతు సమస్యల పైన దృష్టి సారించింద్నారు.
అంతకుముందు ప్రాజెక్టుల విషయమై మాట్లాడుతూ... ఎన్ని కోట్ల రూపాయలు ఖర్చైనా సరే ప్రభుత్వం రాష్ట్రంలో పెండింగ్‌లో ఉన్న ప్రాజెక్టులను పూర్తి చేస్తుందన్నారు.
ఆదిలాబాద్ జిల్లా కెరామెరి మండలం అమ్మనగూడ ప్రాజెక్టును ఆయన మంత్రులు జోగు రామన్న, ఇంద్రకరణ్ రెడ్డిలతో కలిసి పరిశీలించారు. గత ప్రభుత్వాల నిర్వాకం వల్లే రాష్ట్రంలో ప్రాజెక్టులు పెండింగ్‌లో ఉన్నాయన్నారు. అమ్మనగూడ ప్రాజెక్టును రూ.7 కోట్ల 67 లక్షలతో పూర్తి చేస్తామన్నారు.

జై జవాన్, జై కిసాన్ నినాదంతో రైతులను ఆదుకుంటాం: విహెచ్
జై జవాన్, జై కిసాన్ నినాదంతో తాము రైతులను ఆదుకుంటామని కాంగ్రెస్ రాజ్యసభ సభ్యుడు వి హనుమంత రావు చెప్పారు. ఆయన నల్గొండ జిల్లాలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రైతు సదస్సు జరిగింది. ఈ సదస్సులో ఆయన మాట్లాడారు.
ముఖ్యమంత్రి సొంత జిల్లా మెదక్‌లో ఎక్కువ ఆత్మహత్యలు జరిగాయన్నారు. అయినప్పటికీ ముఖ్యమంత్రికి, మంత్రులకు పట్టింపు లేకుండా పోయిందన్నారు. రైతులకు కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందన్నారు. కెసిఆర్ పాలన జోకర్ పాలనలా ఉందని మరో నేత కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అన్నారు.
రైతులంటే సీఎంకు ఏమాత్రం ఇష్టం లేదని ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీలోని అనైతిక వల్లనే టిఆర్ఎస్ గెలిచిందని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత పాల్వాయి గోవర్ధన్ రెడ్డి వేరుగా అన్నారు. పాలనలో టిఆర్ఎస్ పూర్తిగా విఫలమైందన్నారు.












Click it and Unblock the Notifications