అక్కల మాటలు వింటే జూబ్లీ బస్టాండ్‌లో కూర్చోవాల్సి వస్తది- సబితపై రేవంత్ ఫైర్
KTR: తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు.. వాడివేడిగా సాగుతున్నాయి. అధికార, ప్రతిపక్ష సభ్యులు పరస్పరం మాటల యుద్ధానికి దిగుతున్నారు. విమర్శలు, ప్రతివిమర్శలు, ఆరోపణాస్త్రాలను సంధించుకుంటోన్నారు. గతాన్ని తవ్వి తీస్తోన్నారు. ఒకరి పరిపాలనలోని లోపాలను మరొకరు బయటికి తీస్తోన్నారు.
ఈ క్రమంలో- ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, మాజీ మంత్రి, బీఆర్ఎస్ శాసన సభ్యురాలు సబిత ఇంద్రారెడ్డి మధ్య తీవ్రస్థాయిలో వాగ్యుద్ధం చోటు చేసుకుంది. దీని తీవ్రత ఏ స్థాయికి వెళ్లిందటే.. సభను కొన్ని నిమిషాల పాటు వాయిదా వేయాల్సి వచ్చింది స్పీకర్‌కు.

సబితా ఇంద్రారెడ్డి గతంలో కాంగ్రెస్ పార్టీలో కొనసాగిన విషయం తెలిసిందే. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయంలో ఆమె హోం మంత్రిగా పని చేశారు. అనంతరం కే రోశయ్య, నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి కేబినెట్‌లోనూ కొనసాగారు. 2014లో ఏపీ విభజన తరువాత చోటు చేసుకున్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో కాంగ్రెస్‌ను వీడారు. బీఆర్ఎస్‌లో చేరారు.
సబితా ఇంద్రారెడ్డి పార్టీ ఫిరాయింపు వ్యవహారంలో అసెంబ్లీలో హాట్ టాపిక్ అయింది. పార్టీ మారడాన్ని తప్పుపట్టారు. గతంలో తమ ప్రభుత్వంలో దశాబ్ద కాలం పాటు సబిత ఇంద్రారెడ్డికి మంత్రి పదవి ఇచ్చి గౌరవించామని భట్టి విక్రమార్క అన్నారు. ఇక భవిష్యత్తులో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాదనే ఉద్దేశంతోనే ఆమె పార్టీ ఫిరాయించారని, బీఆర్ఎస్‌లోకి వెళ్లారని అన్నారు.
కాంగ్రెస్ పార్టీ తనను సీఎల్పీ లీడర్‌ను చేస్తే తనకు అండగా, మద్దుతుగా వెనక ఉండాల్సింది పోయి పదవి కోసం సబిత పార్టీ ఫిరాయించారంటూ భట్టి విక్రమార్క ఆరోపించారు. తనను ప్రతిపక్ష నేత హోదా కూడా లేకుండా చేయడానికే ఆ పని చేశారని మండిపడ్డారు. పార్టీలు మారి, ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసింది కాక ఇప్పుడు ఏదో మాట్లాడుతున్నారని, సబిత బాధ ఎంటో అర్థం కావట్లేదని చెప్పారు.

రేవంత్ రెడ్డి దీన్ని కొనసాగించారు. ప్రతిపక్ష నాయకుడు సభకే రాడని, ఇక తమతో ఏం కలిసి వస్తారని కేటీఆర్‌ను ఉద్దేశించి అన్నారు. మీ వెనకాల ఉన్న అక్కల మాటలు వింటే కేటీఆర్ జూబ్లీ బస్టాండ్‌లో కూర్చోవాల్సి వస్తది అంటూ వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలపై బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు మండిపడ్డారు. మహిళా ఎమ్మెల్యేలను కించపరిచారంటూ అభ్యంతరం వ్యక్తం చేశారు. స్పీకర్ పోడియం వైపు దూసుకెళ్లారు.
దీనిపై రేవంత్ రెడ్డి వివరణ ఇచ్చారు. కాంగ్రెస్‌ను, తనను మోసం చేసిన సబితక్కతో జాగ్రత్తగా ఉండాలని చెప్పానని అన్నారు. తాను చెప్పే మాట నిజమా? కాదా? అనేది సబితక్క గుండె మీద చేయి వేసుకొని చెప్పాలని రేవంత్ రెడ్డి చెప్పారు. వ్యక్తిగతంగా జరిగిన చర్చను సబితక్క సభలో పెట్టిందని పేర్కొన్నారు.
నువ్వు కాంగ్రెస్‌లోకి వస్తే ముఖ్యమంత్రివి అవుతావని సబితక్క తనతో చెప్పిందని, అలాగే మల్కాజ్ గిరి లోక్‌సభ నుంచి పోటీ చేయమని సూచించింది కూడా సబితక్కేనని రేవంత్ రెడ్డి చెప్పారు. ఇన్ని మాటలు మాట్లాడిన సబితక్క తమ్ముడిని మోసం చేసి బీఆర్ఎస్ పార్టీలోకి వెళ్లిందని ఎద్దేవా చేశారు.
దీనిపై సబితా ఇంద్రారెడ్డి బదులిచ్చారు. రేవంత్ రెడ్డికి ఒక అక్కలా నువ్వు చాలా గొప్పోడివి అవుతావు అని ఆశీర్వదించానని, ఇప్పుడు ఆయన తనను టార్గెట్ చేసి మాట్లాడుతున్నాడని, ఎందుకు కక్ష తీర్చుకుంటున్నాడని ఎదురుదాడికి దిగారు. కేసీఆర్ ఇంటి మీద వాలిన కాకి తన ఇంటి మీద వాలితే కాల్చేస్తానని చెప్పిన రేవంత్ రెడ్డి.. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను ఎలా చేర్చుకుంటున్నారని ప్రశ్నించారు.
అక్కల మాట వింటే జూబ్లీ బస్టాండ్‌లో కూర్చోవాల్సి వస్తుందంటూ రేవంత్ రెడ్డి.. కేటీఆర్‌ను ఉద్దేశించి చెప్పడం పట్ల సబితా ఇంద్రారెడ్డి అభ్యంతరం వ్యక్తం చేశారు. కేటీఆర్‌ను తాము ఏం మోసం చేశామో చెప్పాలంటూ పట్టుబట్టారు. రేవంత్ రెడ్డి తన మాటలను వెనక్కి తీసుకోవాలంటూ డిమాండ్ చేశారు.












Click it and Unblock the Notifications