కే రాఘవేంద్రరావు హైకోర్టు నోటీసులు: బాలకిషన్ పిటీషన్- తెరపై పాత కేసు..!!
హైదరాబాద్: టాలీవుడ్‌కు చెందిన ప్రముఖ దర్శకుడు కే రాఘవేంద్ర రావు న్యాయపరమైన ఇబ్బందుల్లో పడ్డారు. గతంలో నమోదైన ఓ పాత కేసు తాజాగా తెర మీదికి వచ్చింది. ఈ కేసులో తెలంగాణ హైకోర్టు నోటీసులను సైతం జారీ చేయడం ప్రాధాన్యతను సంతరించుకుంది. ఆయన కుటుంబ సభ్యులకూ నోటీసులు అందాయి.
తెలుగు చలన చిత్ర పరిశ్రమను అభివృద్ధి చేయడానికి గతంలొ ప్రభుత్వం కేటాయించిన రెండెకరాల భూమిని తన సొంత అవసరాలకు వాడుకున్నారనేది కే రాఘవేంద్రరావుపై ఉన్న ప్రధాన ఆరోపణ. ఈ కేసు గతంలో నోటీసులను సైతం అందుకున్నారు గానీ ఆపై ఇందులో ఎలాంటి పురోగతి కనిపించలేదు. తాజాగా ఈ కేసు మరోసారి హైకోర్టు మెట్లెక్కింది.

హైదరాబాద్‌లో అత్యంత ఖరీదైన బంజారాహిల్స్ పరిధిలోని షేక్‌పేట్‌లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వం సినీ పరిశ్రమకు రెండు ఎకరాల స్థలాన్ని కేటాయించింది. దీన్ని తన సొంత అవసరాలకు వాడుకున్నారంటూ మెదక్‌కు చెందిన బాలకిషన్ అనే వ్యక్తి 2012లో ప్రజాప్రయోజన వ్యాజ్యాన్ని దాఖలు చేశారు.
సినిమా రంగాన్ని అభివృద్ధి చేయడానికి కేటాయించిన ఈ స్థలాన్ని రాఘవేంద్రరావు వాణిజ్య అవసరాలకు వినియోగించుకున్నారని ఈ పిటీషన్‌లో పొందుపరిచారు. ఇది నిబంధనలకు విరుద్ధమని పేర్కొన్నారు. దీన్ని విచారణకు స్వీకరించిన హైకోర్టు ఆయనకు నోటీసులను జారీ చేసింది.
ఇందులో ఎలాంటి పురోగతి లేకపోవడంతో పిటీషనర్ మరోసారి హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అలోక్ అరథే, జస్టిస్ ఎన్వీ శ్రవణ్ కుమార్‌లతో కూడిన ద్విసభ్య ధర్మాసనం విచారణ చేపట్టింది. రాఘవేంద్రరావు, ఆయన బంధువులు కృష్ణమోహన్ రావు, చక్రవర్తి, విజయలక్ష్మి, అఖిలాండేశ్వరి, లాలస దేవికి నోటీసులను ఇచ్చింది. తదుపరి విచారణను జనవరి 18వ తేదీకి వాయిదా వేసింది.












Click it and Unblock the Notifications