ప్రత్యూష పెదనాన్నను ప్రవేశపెట్టండి: హైకోర్టు ఆదేశం
హైదరాబాద్: తండ్రి, సవతి తల్లి చేతుల్లో చిత్రహింసలకు గురై గ్లోబల్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న 19 ఏళ్ల యువతి ప్రత్యూష పెదనాన్నను శుక్రవారంనాడు తమ ముందు హాజరు పరచాలని హైకోర్టు ఆదేశించింది. ప్రత్యూష కేసుకు సంబంధించిన నివేదికను పోలీసులు గురువారం హైకోర్టుకు సమర్పించారు.
ప్రస్తుతం ప్రత్యూష కోలుకుంటోందని, ఆమె శారీరక, మానసిక ఆరోగ్య పరిస్థితి మెరుగుపడిందని, పరారైన ప్రత్యూష తండ్రి రమేష్‌ను అరెస్టు చేశామని పోలీసులు తమ నివేదికలో చెప్పారు. ఈ కేసులో సరైన సమయంలో స్పందించిన ఎల్బీ నగర్ పోలీసులను, ప్రత్యూషకు వైద్యం అందించిన గ్లోబల్ ఆస్పత్రి యాజమాన్యాన్ని హైకోర్టు అభినందించింది.

ప్రత్యూష ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయిన తర్వాత ఎక్కడ ఉంటుందో తెలుసుకోవాలని హైకోర్టు పోలీసులను ఆదేశించింది. ప్రభుత్వ స్వచ్ఛంద సంస్థల్లో ఉండేందుకు ప్రత్యూష అంగీకరిస్తే సదుపాయాలు కల్పిస్తామని చెప్పింది. ఈ విషయంపై ప్రత్యూష అభిప్రాయం కనుక్కుని నివేదిక సమర్పించాలని కూడా హైకోర్టు ఆదేశించింది.
ప్రత్యూషను చిత్రహింసలు పెట్టిన కేసులో ఆమె తండ్రి రమేష్‌ను పోలీసులు బుధవారం రాత్రి అదుపులోకి తీసుకున్నారు. సవతి తల్లి చాముండేశ్వరి అలియాస్ శ్యామలను ఇది వరకే అరెస్టు చేశారు ఓ స్వచ్ఛంద సంస్థ సహకారంతో ప్రత్యూష తల్లిదండ్రుల కబంధ హస్తాల నుంచి బయటపడి ప్రస్తుతం చికిత్స పొందుతోంది.












Click it and Unblock the Notifications