అతనో హెడ్‌మాస్టర్: యువతిని తెచ్చి అసభ్యంగా, పిల్లలతో వెకిలి చేష్టలు
మహబూబ్‌నగర్: పిల్లలకు విద్యాబుద్ధులు చెప్పాల్సిన ఓ పాఠశాల ప్రధానోపాధ్యాయుడు సమాజానికి మచ్చ తెచ్చే విధంగా ప్రవర్తించిన వైనం వెలుగు చూసింది. నాలుగు పదుల వయస్సు దాటినా పెళ్లి చేసుకోని ఆ ప్రధానోపాధ్యాయుడు పిల్లల పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తున్న వైనం పట్ల ఏవగింపు వ్యక్తమవుతోంది.
దాంతో ఆగకుండా ఏకంగా పంద్రాగస్టు రోజున పాఠశాలకు ఓ యువతిని తీసుకొచ్చి, అసభ్యకరంగా వ్యవహరించాడు. విషయం బయటకు పొక్కడంతో సోమవారం నిర్వహించిన గ్రామజ్యోతి కార్యక్రమంలో గ్రామస్తులు ఈ విషయాన్ని అధికారుల దృష్టికి తీసుకొచ్చారు. మహబూబ్‌నగర్ జిల్లా వడ్డేపల్లి మండలంలోని జిల్లెడదిన్నె గ్రామ ప్రభుత్వ పాఠశాల ఆవరణలో సోమవారం అధికారులు గ్రామజ్యోతి కార్యక్రమాన్ని ప్రారంభించి, గ్రామసభను నిర్వహించారు.
సభ జరుగుతున్న సమయంలో ఒక్కసారిగా గ్రామస్తులు సభలో ఆందోళనకు దిగారు. పాఠశాల హెచ్‌ఎం ఈశ్వరయ్య విద్యార్థినుల పట్ల అసభ్యకరంగా వ్యవహరిస్తున్నారని మహాలక్ష్మి, దస్తగిరి, ఆంజనేయులు, స్వాములు, వెంకటేష్, రాఘవరెడ్డి, ఈశ్వర్‌రెడ్డి, మద్దిలేటి, శాంతకుమార్, గోవర్ధన్‌రెడ్డి, మధు, భీసన్నలు లిఖిత పూర్వకంగా అధికారులకు ఫిర్యాదు చేశారు.

సాయంత్రం వేళ పాఠశాల వదిలిన సమయంలో విద్యార్థినులు తనకు ముద్దులు పెట్టి వెళ్లాలని చెబుతున్నట్లు ఆరోపించారు. పంద్రాగస్టు రోజున ఓ మహిళను పాఠశాలకు పిలిచించి, అసభ్యకరంగా వ్యవహరించాడని చెప్పారు. విద్యార్థినులు కూడా సభలో తమకు హెచ్‌ఎం వద్దంటూ ప్లకార్డులు ప్రదర్శించారు. అనంతరం గ్రామస్తులు పాఠశాలకు తాళం వేశారు. హెచ్‌ఎంపై చర్యలు తీసుకునే వరకు తాళాలు తెరిచేది లేదని భీష్మించుకున్నారు
దీంతో స్పందించిన స్పెషల్ ఆఫీసర్ రమణారెడ్డి పాఠశాలలో పనిచేసే మరో ఉపాధ్యాయుడైన మస్తాన్‌వలి ద్వారా హాజరుపట్టికను తెప్పించి, సెలవు చీటిని పరిశీలించారు. గ్రామజ్యోతి రోజు సెలవు ఎలా పెట్టారని, ఎంఈఓ అనుమతి కూడా లేకుండా పాఠశాలకు రాకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. హెచ్‌ఎం జీతం నిలిపి వేయాలని, డీఈఓ అనుమతితోనే మళ్లీ జీతం తీసుకోవాలంటూ హాజరుపట్టికలో రాశారు.
ఇంతా జరిగినా, తనపై కక్షతో కొందరు అసత్య ఆరోపణలు చేస్తున్నారని ఈశ్వరయ్య అంటున్నారు. తన విధులకు ఆటంకం కలిగించడానికే ఇలా వ్యవహరిస్తున్నారని చెబుతున్నారు. ఇందులో తన తప్పేమీ లేదని సమర్థించుకున్నారు.












Click it and Unblock the Notifications