తెలంగాణాలో మొదలైన హోం ఓటింగ్; ఓటేస్తున్న వృద్ధులు, దివ్యాంగులు!!
తెలంగాణా రాష్ట్ర వ్యాప్తంగా అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి ఓటింగ్ కొనసాగుతుంది. అన్ని జిల్లాలలోనూ ఎన్నికల అధికారులు ఈ దఫా హోం ఓటింగ్ పై ప్రధానంగా దృష్టి సారించారు. 80 ఏళ్ళు పైబడిన వృద్ధులు, దివ్యాంగులకు వారి ఇళ్ళ వద్దకే వెళ్లి ఓటింగ్ చేయిస్తున్నారు. మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా 28,057మంది ఇళ్ళ నుండే ఓటు వేసేందుకు దరఖాస్తు చేసుకున్నారు.
ఈ నెల 30న జరగనున్న అసెంబ్లి ఎన్నికలలో ఓటు హక్కు ఉన్న ప్రతి ఓక్కరు వారి ఓటును సద్వినియోగం చేసుకోవాలని జిల్లా ఎన్నికల అధికారులు చెప్తున్నారు. ఇక హోం ఓటింగ్ లో భాగంగా వరంగల్ జిల్లావ్యాప్తంగాహోమ్ ఓటింగ్ కొనసాగుతోంది. ఇప్పటికే నర్సంపేట నియోజకవర్గంలో హోం ఓటింగ్ పూర్తి చేసిన అధికారులు, నేటి నుండి వరంగల్ తూర్పు నియోజకవర్గంలో హోమ్ ఓటింగ్ నిర్వహిస్తున్నారు.

ఫామ్ 12 డి ద్వారా 110మంది ఓటర్లు దీని కోసం దరఖాస్తు చేసుకున్నారు. వీరిలో 87ఏళ్లు పైబడినవారు 69మంది, దివ్యాంగులు 31మంది, ఇతరులు పదిమంది ఉన్నారు. వారికి ఇంటి దగ్గరనే మూడు ప్రత్యేక బృందాల అధికారులు ఓటింగ్ చేయిస్తున్నారు. నేటినుంచి మూడు రోజులపాటు ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5గంటల వరకు అర్హుల ఇళ్లకు వెళ్లి రహస్య ఓటింగ్ నిర్వహిస్తామని ఎన్నికల అధికారులు వెల్లడించారు.
ఇదిలా ఉంటే కరీంనగర్ జిల్లా హుజురాబాద్, మానకొండూర్ నియోజక వర్గాలలో నిర్వహించిన హోం ఓటింగ్ లను జిల్లా ఎన్నికల ఆధికారి పమేలా సత్పతి పరిశీలించారు. ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ, ప్రతి ఓక్కరు వారి ఓటుహక్కును సద్వినియోగం చేసుకోవాలని ఎన్నికల సంఘం వివిధ కార్యక్రమాలకు రూపకల్పన చేసిందని పేర్కొన్నారు.
ఇందులో భాగంగా 80 సంవత్సరాలు పైబడిన వృద్దులు మరియు 40 శాతం కన్న ఎక్కువ వైకల్యం ఉన్న దివ్యాంగులు వారి పోలింగ్ కేంద్రాల వరకు వెళ్లి ఓటు వేయాల్సిన అవసరం లేకుండా, వారి ఇంటివద్దకే ఎన్నికల అధికారులు వచ్చి వారి ఓటును తీసుకునే సౌలభ్యాన్ని కల్పించిందని పేర్కొన్నారు.
పోలింగ్ రోజు ఇతర వికలాంగులు, వృద్దుల కొరకు వీల్ చైర్లను, ప్రత్యేక సదుపాయాలను కల్పించడం జరిగిందని తెలిపారు. మనం మనఓటును సంపూర్ణంగా సద్వినియోగం చేసుకునేందుకు ఎన్నికల సంఘం చేస్తున్న ఏర్పాట్లను గమనించి, ఓటుహక్కు కలిగిన ప్రతిఒక్కరు వారి ఓటును సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు.












Click it and Unblock the Notifications