సీతక్క ఓటుపై డైలమా : చెల్లుతుందా- ఏం జరిగింది..!!
దేశ వ్యాప్తంగా రాష్ట్రపతి ఎన్నికల పోలింగ్ జరుగుతోంది. అందులో భాగంగా తెలంగాణ అసెంబ్లీలో రాష్ట్ర ఎమ్మెల్యేలు తమ ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. రాష్ట్రపతి అభ్యర్ధులుగా రేసులో ఉన్న ఎన్డీఏ అభ్యర్ధి ద్రౌపది ముర్ము... విపక్షాల అభ్యర్ధిగా యశ్వంత్ సిన్హా నిలిచారు. తెలంగాణ అధికార పార్టీ టీఆర్ఎస్ తో పాటుగా.. కాంగ్రెస్ సైతం విపక్షాలు బలపర్చిన యశ్వంత్ సిన్హాకు మద్దతు ప్రకటించాయి. అందులో భాగంగా టీఆర్ఎస్.. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు అసెంబ్లీలో తమ ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. అందులో భాగంగా.. కాంగ్రెస్ ఎమ్మెల్యే సీతక్క ఓటు వేసేందుకు అసెంబ్లీకి వచ్చారు.
ముర్ముకు ఓటు వేశారంటూ
ప్రతిపక్షాల బలపరిచిన యశ్వంత్ సిన్హాకు కాకుండా ఎన్డీయే బలపరచిన ద్రౌపది ముర్ముకు ఆమె ఓటేశారనే ప్రచారం జరిగింది. కానీ, అసలు ఏం జరిగిందనేది సీతక్క వివరణ ఇచ్చారు. తాను పోలింగ్ కు వెళ్లిన సమయంలో తనకు ఇచ్చిన బాలెట్ పత్రం పైన స్కెచ్ మార్క్ ఉందని గుర్తించినట్లు చెప్పారు. ఇదే విషయాన్ని తాను అధికారలుకు వివరించి..మరో పత్రం ఇవ్వాలని కోరానని వెల్లడించారు. కానీ, అందుకు అధికారులు నిరాకరించటంతో.. తన పార్టీ నిర్ణయించిన మేరకే తాను ఓటు వేశానని చెప్పుకొచ్చారు. ఎన్డీఏ అభ్యర్ధికి ఓటు వేసి ఉంటే మరో బాలెట్ ఇవ్వాలని ఎందుకు కోరుతానంటూ ప్రశ్నించారు.

ఓటు చెల్లుబాటు అవుతుందా
అసలు సీతక్క ఓటు ఇప్పుడు చెల్లుతుందా లేదా అనేది సైతం చర్చ జరుగుతోంది. బాలెట్ పత్రం పైన ఎటువంటి మార్కులు ఉండకూడదని అధికారులు స్పష్టం చేస్తున్నారు. అయితే, సీతక్కకు ఇచ్చిన బాలెట్ పత్రం పైన స్కెచ్ మార్క్ ఉందని చెబుతున్నారు. అయితే, అది అభ్యర్ధుల పేర్ల మీద లేదని స్పష్టం చేస్తున్నారు.
తన ఓటు తాను పార్టీ నిర్ణయించిన మేరకే వేశానని చెప్పారు. కానీ, ఇప్పుడు ఆ ఓటు చెల్లుబాటు అవుతుందా లేదా అనేది మాత్రం రిటర్నింగ్ అధికారి నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. ఇప్పటికే సీఎం కేసీఆర్ తో సహా.. మరో నలుగురు మినహా అందరూ తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు.

రేపు ఢిల్లీకి బ్యాలెట్ బాక్స్
ఇప్పుడు తెలంగాణ అసెంబ్లీలో కాంగ్రెస్ నుంచి ఆరు ఓట్లు ఉన్నాయి. ఈ ఆరు ఓట్లు యశ్వంత్ సిన్హాకు పోల్ కావాల్సి ఉంది. బీజేపికి చెందిన మూడు ఓట్లు మాత్రమే మొత్తం తెలంగాణ అసెంబ్లీలో ముర్ముకు అనుకూలగా పోల్ కానున్నాయి. ఏపి నుంచి ఎమ్మెల్యేగా ఉంటూ.. తన ఓటు హక్కు తెలంగాణ అసెంబ్లీలో వినియెగించుకున్న కందకూరు ఎమ్మెల్యే మహీధర్ రెడ్డి ఓటు సైతం పార్టీ నిర్ణయం మేరకు ముర్ముకు పోలవ్వాల్సి ఉంటుంది. దీంతో..మొత్తం పోలింగ్ ముగిసిన తరువాత రేపు ఢిల్లీకి బ్యాలెట్ బాక్సులు చేరుకోనున్నాయి.












Click it and Unblock the Notifications