తెలంగాణ బీజేపీ కొత్త సారథి ఎవరు?: రేసులో ఉన్నది వీరే
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర బీజేపీ కొత్త అధ్యక్షుడి ఎంపికకు రంగం సిద్ధమవుతోంది. ప్రస్తుతం అధ్యక్షుడిగా ఉన్న జి.కిషన్ రెడ్డి మరోసారి ఆ పదవిని స్వీకరించలేనని పార్టీ అధినాయకత్వానికి స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో కొత్త బీజేపీ అధ్యక్షుడి నియామకంపై దృష్టి సారించారు.
రాష్ట్ర విభజన తర్వాత తెలంగాణలో జరిగిన ఎన్నికల ఫలితాలు, తెలుగుదేశం పార్టీతో కలసి ముందుకెళ్లాల్సిన అవసరం, పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేయడం వంటి అంశాలు ప్రాతిపదికగా కొత్త అధ్యక్షుడి నియామకంపై దృష్టిపెట్టారు.
Also Read: ఆ రోజు నాకు నిద్ర పట్టలేదు: నేతలు పార్టీ వీడటంపై రేవంత్‌రెడ్డి ఆవేదన
2019 అసెంబ్లీ ఎన్నికలకు పార్టీని సమాయత్తం చేసేందుకు రానున్న మూడు సంవత్సరాలు ఎంతో కీలకం కావడంతో కొత్త బీజేపీ అధ్యక్షుడి నియామకంపై ఆచితూచి వ్యవహరిస్తున్నారు. బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి మురళీధర్‌రావుని నియమించాలనే అంశంపై పార్టీలో గతంలో చర్చకు వచ్చినా ఆయన అందుకు సుముఖంగా లేరని సమాచారం.

దీంతో తెలంగాణ బీజేపీ అధ్యక్ష రేసులో తాజాగా పార్టీ సీనియర్ నేతలు కె.లక్ష్మణ్, చింతల రామచంద్రారెడ్డి, పేరాల చంద్రశేఖర్‌రావు, ఎమ్మెల్సీ రామచందర్‌రావుల పేర్లను అగ్రనేతలు పరిశీలిస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం. కె.లక్ష్మణ్ శాసనసభ్యుడిగా రెండుసార్లు ఎన్నికయ్యారు. పార్టీపై మంచి అవగాహన ఉన్న వ్యక్తి.
తెలంగాణ బీజేపీలో మరో సీనియర్ నేత చింతల రామచంద్రారెడ్డి పేరుని కూడా బీజేపీ అధిష్టానం పరిశీలనలో ఉంది. మరోవైపు జాతీయ పార్టీతోపాటు ఇటీవల నెహ్రూ యువకేంద్రం జాతీయ ఉపాధ్యక్షుడిగా కొనసాగుతున్న పేరాల చంద్రశేఖర్‌రావు, ఎమ్మెల్సీ రామచందర్‌రావు పేర్లనూ బీజేపీ పరిశీలిస్తోంది.
గతేడాది జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ జీహెచ్‌ఎంసీ పరిధిలోనే ఐదు స్థానాలను దక్కించుకుంది. ఇక గ్రేటర్ ఎన్నికల్లో టీడీపీతో కలిసి పోటీ చేసినా ఘోర పరాజయం పాలైంది. ఈ నేపథ్యంలో పార్టీని నడిపించే వారి కోసం బీజేపీ అధిష్టానం దృష్టి పెట్టింది.












Click it and Unblock the Notifications