8వ రౌండ్ లో టీఆర్ఎస్ ఆధిక్యం-గెల్లు శ్రీను స్వగ్రామంలో ఈటలకు మెజార్టీ : దుబ్బాక తరహాలో చివరి దాకా..!!
హుజూరాబాద్ పోరులో క్షణ క్షణానికి పరిస్థితులు మారిపోతున్నాయి. ఇప్పటి వరకు జరిగిన ఏడు రౌండ్ల లెక్కింపులో బీజేపీ అభ్యర్ధి ఈటల రాజేందర్ ఆధిక్యతతో కొనసాగారు. అనూహ్యంగా 8వ రౌండ్ లో మాత్రం టీఆర్ఎస్ ఆధిక్యత సాధించింది. ఈ రౌండ్ ఓట్లు వీణవంక మండలంలో లెక్కింపు సాగుతోంది. ఇక్కడ పోటీలో ఉన్న టీఆర్ఎస్ అభ్యర్ధి గెల్లు శ్రీను...కాంగ్రెస్ మాజీ అభ్యర్ధి..ప్రస్తుత టీఆర్ఎస్ నేత కౌశిక్ రెడ్డి స్వగ్రామాలు ఈ రౌండ్ లోనే లెక్కేసారు. టీఆర్ఎస్ అభ్యర్ధి గెల్లు శ్రీను స్వగ్రామం హిమ్మత్ నగర్ లో 191 ఓట్ల ఆధిక్యం బీజేపీ దక్కించుకుంది.

టీఆర్ఎస్ అభ్యర్ది స్వగ్రామంలో రాజేందర్ కు మెజార్టీ
అక్కడ గెల్లుకు 358 ఓట్లు రాగా... రాజేందర్ కు 549 ఓట్లు వచ్చాయి.ఈ రౌండ్ లో టీఆర్ఎస్ 162 ఓట్ల మెజార్టీ సాధించటంతో రాజేందర్ మెజార్టీ 3,270 కి తగ్గింది. ఎనిమిది రౌండ్ల తర్వాత బీజేపీ 35,107.. టీఆర్‌ఎస్ 31,837.. కాంగ్రెస్ 1175 ఓట్లు సాధించాయి. ఎనిమిదో రౌండ్‌లో టీఆర్‌ఎస్ 4248.. బీజేపీ 4,086.. కాంగ్రెస్ 89 ఓట్లు సాధించాయి. మొత్తం 22 రౌండ్లు లెక్కించాల్సి ఉంది. అయితే, ఇప్పుడు చూస్తున్న కౌంటింగ్..వెల్లడవుతున్న ఫలితాలు గతంలో జరిగిన దుబ్బాక ఫలితాలను గుర్తు చేస్తోంది.

రౌండ్ రౌండ్ కు పెరుగుతున్న ఉత్కంఠ
ప్రతీ రౌండ్ లోనూ లెక్కలు మారుతూ చివరి రౌండ్ వరకు ఇదే ఒరవడి కొనసాగే అవకాశం కనిపిస్తోంది. ఇప్పుడు వీణవంక మండలం ఈవీఎంలు లెక్కేస్తున్నారు. ఆ తరువాత జమ్మికుంట, ఇల్లంతకుంట పరిధిలోని ఓట్లు లెక్క వేయనున్నారు. నాడు దుబ్బాకలోనూ రఘునందన్ రావు సైతం టీఆర్ఎస్ కు వ్యతిరేకంగా పోరాటం చేసారు. పలు మార్లు ఓడిన అభ్యర్ధి కావటంతో ఉప ఎన్నిక అయినా.. చివరి రౌండ్ లో విజయం సాధించారు, తొలి నుంచి ఆధిక్యత సాధించినా... మధ్యలో టీఆర్ఎస్ ఆ మెజార్టీని దాటేసింది.

అధికారం - పధకాలు అంతగా ప్రభావం చూపలేదా
ఇక, ఇప్పుడు ఈటల రాజేందర్ పైన సానుభూతి వర్కవుట్ అయినట్లుగా స్పష్టం అవుతోంది. ఆయన ఇదే నియోజవకర్గం నుంచి ఆరు సార్లు ఎమ్మెల్యేగా.. మంత్రిగా పని చేసారు. ఇక్కడ ప్రతీ గ్రామంతోనూ సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. అధికార టీఆర్ఎస్ ఈ ఎన్నికల్లో గెలుపు కోసం చివరి వరకు అన్ని ప్రయత్నాలు చేసింది. గెలుపు పైన ధీమాగా కనిపించింది. కానీ, కౌంటింగ్ చూస్తే మాత్రం రాజేందర్ అంచనా వేసిన దాని కంటే గట్టి పోటీ ఇచ్చినట్లుగా స్పష్టంగా కనిపిస్తోంది.

పోటీ ఇవ్వలేకపోయిన కాంగ్రెస్
అయితే, కాంగ్రెస్ మాత్రం నామ మాత్రపు పోటీకే పరిమితం అయినట్లుగా వచ్చిన ఓట్లు స్పష్టం చేస్తున్నాయి. ఈ ఎన్నికల్లో ఇంకా దాదాపుగా 16 రౌండ్లు లెక్కించాలి. ఏ రౌండ్ లోనూ మెజార్టీ ఇద్దరి మధ్య అంత భారీగా లేదు. ఎవరు పై చేయి సాధిస్తున్న వందల సంఖ్యలోనే ఓట్ల తేడా కనిపిస్తోంది. దీంతో..రానున్న రౌండ్లలో ఎక్కడా ఒకరు రెండు వేల వరకు మెజార్టీ సాధిస్తే మొత్తం ఫలితం పైనే ప్రభావం పడే అకాశం ఉంది.

దుబ్బాక తరహాలోనే చివరి రౌండ్ దాకా..
అయితే, ఈ ఎన్నికలో సైతం దుబ్బాక తరహాలో చివరి రౌండ్ వరకు ఫలితం నిర్దిష్టంగా అంచనా వేయలేని పరిస్థితి కనిపిస్తోంది. ఎగ్జిట్ పోల్స్ రాజేందర్ కు మద్దతుగా అంచనాలు ఇచ్చాయి. కౌంటింగ్ సాగుతున్న కొద్దీ ఉత్కంఠ మరింతగా పెరుగుతోంది. సాయంత్రం 6 గంటలకు తెది ఫలితం వెల్లడయ్యే అవకాశం కనిపిస్తోంది. కానీ, బీజేపీ నేతలు ఇప్పటికే తమ విజయం ఖాయమంటూ వరుసగా ప్రకటనలు చేస్తున్నారు. టీఆర్ఎస్ నేతలు మాత్రం వేచి చూసే ధోరణితోనే కనిపిస్తున్నారు. దీంతో..తుది ఫలితం పైన ఉత్కంఠ కొనసాగుతోంది.












Click it and Unblock the Notifications