రోడ్లపై గుంతలను పూడ్చాలంటూ.. హైదరాబాద్ లో ఓ వ్యక్తి వినూత్న నిరసన.. వైరల్ వీడియో
హైదరాబాద్ లోని పలు ప్రాంతాల్లో రోడ్లు అధ్వానంగా మారుతున్నాయి. వర్షాల కారణంగా రోడ్డు దెబ్బతింటున్నాయి. ఎక్కడపడితే అక్కడ గుంతల కారణంగా వాహనదారులు రోడ్డుపై ప్రయాణించే సమయంలో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రోడ్డు ప్రమాదాలు అధికంగానే జరుగుతున్నాయి.
ఇక భాగ్య నగరంలో వర్షం పడిందంటే చాలు గుంతల కారణంగా ఎక్కడికక్కడ నీళ్లు, మురుగు నిలిచిపోతుంది. అయితే హైదరాబాద్ లోని రోడ్ల పరిస్థితిపై తాజాగా ఓ వ్యక్తి వినూత్నంగా నిరసన చేపట్టాడు. ఇమ్లిబన్ పుత్లిబౌలి రోడ్ లో ఫిరోజ్ అనే వ్యక్తి పాట్ హోల్స్ దగ్గర పడుకుని గుంతలు పూడ్చాలంటూ నిరసన వ్యక్తం చేశాడు. వెంటనే అక్కడకు చేరుకున్న ట్రాఫిక్ పోలీసులు అతడ్ని బుజ్జగించే ప్రయత్నం చేశారు. కానీ ఆ వ్యక్తి మాత్రం గుంతలను పూడ్చితేనే తాను ఇక్కడి నుంచి వెళ్తానని అక్కడే బురద నీటిలోనే పడుకున్నాడు.

రాష్ట్ర ప్రభుత్వం గుంతలను పూడ్చే కార్యక్రమంలోనే ఉందని ఫిరోజ్ కు ఓ పోలీస్ వివరించే ప్రయత్నం చేశాడు. అయితే.. ప్రభుత్వం ఏం చేస్తుందో తనకు తెలుసని నేను ఇక్కడ ఒంటరిగా పడుకున్నాను.. ఇందులో తప్పేమీ లేదు అని పేర్కొన్నాడు. అతని నిరసన కారణంగా ఆ ప్రాంతంలో భారీ ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. ఇక ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.
ఎట్టకేలకు ఫిరోజ్ ను రోడ్డుపై నుంచి పక్కకు జరిపి పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు. మరోవైపు ప్రయాణికులకు కలిగే ఇబ్బందులను నివారించడానికి.. ప్రమాదాలను అరికట్టడానికి.. దెబ్బతిన్న రోడ్లను బాగు చేయడం అలాగే గుంతలను పూడ్చడం వంటి చర్యలను వెంటనే చేపట్టాలని గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్ ఎంసీ) కమిషనర్ ను స్థానికులు కోరారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. ఫిరోజ్ పై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు.












Click it and Unblock the Notifications