జూబ్లీహిల్స్ గ్యాంగ్ రేప్ కేసు: వేధింపుల వీడియో వైరల్ చేసిన వ్యక్తి అరెస్ట్, దర్యాప్తు ముమ్మరం
హైదరాబాద్: రాష్ట్రంలో సంచలనం సృష్టించిన జూబ్లీహిల్స్ సామూహిక అత్యాచారం కేసులో పోలీసుల దర్యాప్తు కొనసాగుతోంది. ఇప్పటికే ఘటనకు పాల్పడిన నిందితులను అరెస్టు చేసిన పోలీసులు.. తాజాగా మరొకరిని అదుపులోకి తీసుకున్నారు. లైంగిక దాడి ఘటనకు సంబంధించిన వీడియోలను సామాజిక మాధ్యమాల్లో వైరల్ చేసిన పాతబస్తీకి చెందిన సుభాన్ అనే వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు.

28న పార్టీ తర్వాత బయటికొచ్చిన బాలిక
జూబ్లీహిల్స్ పోలీసుల తెలిపిన వివరాల ప్రకారం... మే నెల 28న ఓ బాలిక (17) జూబ్లీహిల్స్ రోడ్ నంబర్ 36లోని ఓ పబ్‌కు స్నేహితులతో కలిసి వచ్చింది. దాదాపు 150 మంది 28వ తేదీ మధ్యాహ్నం 1 గంట నుంచి సాయంత్రం 6 గంటల వరకు అక్కడే మద్యం రహిత పార్టీ ఏర్పాటు చేసుకున్నారు. పార్టీ ముగిసే సమయానికి పావుగంట ముందు పబ్ నుంచి బాలిక బయటకు వచ్చింది.అక్కడే ఉన్న రెండు కార్లలో యువతితో పాటు మరో 8మంది యువకులు బయల్దేరారు. ఇందులో బెంజికారుతో పాటు ఇన్నోవా కారు కూడా ఉంది.

ఇంటికి తీసుకెళ్తామని చెప్పి.. బాలికపై సామూహిక అత్యాచారం
బెంజికారులో ప్రముుఖుల కుమారులు, వారి స్నేహితులు ఉన్నారు. వీరంతా బంజారాహిల్స్ రోడ్ నంబర్ 14లోని బేకరి వద్దకు వెళ్లి 6.15 గంటల వరకు అక్కడే ఉన్నారు. అనంతరం ఇంటికి తీసుకెళ్తామని చెప్పడంతో బాలిక.. వారితో కలిసి ఇన్నోవా కారులో బయల్దేరింది. అయితే, నిర్జన ప్రాంతంలో కారు ఆపి అందులో ఉన్న ఐదుగురు నిందితులు.. బాలికపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఆ తర్వాత 7.30గంటలకు జూబ్లీహిల్స్‌లోని పబ్ వద్ద వదిలిపెట్టి వెళ్లిపోయారు.అనంతరం బాలిక ఫోన్ చేయడంతో తండ్రి వచ్చి ఆమెను ఇంటికి తీసుకెళ్లారు.

ఫిర్యాదుతో వెలుగులోకి వచ్చిన దారుణం
అయితే, బాలిక మెడ చుట్టూ గాయాలు ఉండటంతో అనుమానం వచ్చిన తల్లిదండ్రులు ఆరా తీశారు. ఐదుగురు కారులో తనపై లైంగిక దాడికి పాల్పడ్డారని చెప్పడంతో ఆమె తండ్రి జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. నిందితులు అసభ్యంగా ప్రవర్తించినట్లు తొలుత భావించిన పోలీసులు.. అత్యాచారం చేసినట్లు బాలిక చెప్పడంతో సెక్షన్లు మార్చి దర్యాప్తు చేపట్టారు. బాలిక ఫిర్యాదుతో దాదాపు వారం తర్వాత ఈ దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. నిందితులను ఇప్పటికే అరెస్ట్ చేసిన పోలీసులు, లోతుగా దర్యాప్తు జరుపుతున్నారు. నిందితులను కస్టడీకి తీసుకునే అవకాశం ఉంది.

గ్యాంగ్‌రేప్ కేసులో ప్రముఖుల కుమారులే కీలక నిందితులు
కాగా, అత్యాచార ఘటనలో కార్పొరేటర్ కుమారుడు, ఎమ్మెల్యే కుమారుడు, ప్రభుత్వ సంస్థ ఛైర్మన్ కుమారుడు కీలక నిందితులుగా తెలుస్తోంది. పబ్ నుంచి బేకరీకి వెళ్లే సమయంలో బెంజి కారు నడిపింది ఉమేర్ ఖాన్ గా పోలీసులు గుర్తించారు. కార్పొరేటర్ కుమారుడు, ఎమ్మెల్యే తనయుడు, ఉమేర్ ఖాన్ బాలికతో అసభ్యంగా ప్రవర్తిస్తున్న వీడియో ఆధారాలను పోలీసులు సేకరించినట్లు తెలిసింది.
ఇప్పటికే సాదుద్దీన్ మాలిక్(18)తోపాటు మరో ఇద్దరు బాలురను అరెస్ట్ చేసిన పోలీసులు.. శనివారం రాత్రి గుల్బార్గా ప్రాంతంలో మరో బాలుడిని అరెస్ట్ చేశారు. ఉమేర్ ఖాన్(18)ను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. అయితే, దీనిపై స్పష్టత రాలేదు.












Click it and Unblock the Notifications