ఐఏఎస్ అధికారికి భార్య, అత్తింటిపు వేధింపులు: తట్టుకోలేక పోలీసులకు ఫిర్యాదు
హైదరాబాద్: ఉన్నత పదవీ బాధ్యతల్లో ఉన్నవారికి కూడా వేధింపులు తప్పడం లేదు. ఇందుకు తాజా ఉదాహరణగా నిలిచారు ఓ ఐఏఎస్ అధికారి. భార్య, ఆమె ఇంటివారి వేధింపులు తట్టుకోలేక చివరికి ఆయన పోలీసులను ఆశ్రయించాల్సి వచ్చింది. తనపై తప్పుడు కేసులు పెట్టడంతోపాటు వేధింపులకు గురి చేస్తున్న భార్యతోపాటు ఆమె కుటుంబసభ్యులపై చర్యలు తీసుకోవాలని కోరుతూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆయన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న బంజారాహిల్స్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బీహార్‌కు చెందిన సందీప్ కుమార్ ఝా.. తెలంగాణ కేడర్‌లో ఐఏఎస్ అధికారిగా పని చేస్తున్నారు. ఆయనకు 2021 నవంబర్ 21వ తేదీన పల్లవి ఝాతో వివాహం జరిగింది. అయితే, పెళ్లి తర్వాత బంజారాహిల్స్‌లోని ఆయన నివాసంలో 25 రోజులు మాత్రమే భార్యతో కలిసి ఉన్నారు. అనంతరం భార్యాభర్తల మధ్య మనస్పర్థలు తలెత్తాయి. అవి చినికి చినికి గాలి వానలా మారి.. పెద్ద గొడవలుగా మారాయి. దీంతో ఇద్దరూ విడివిడిగా ఉంటున్నారు.

అయినా, తన భార్య.. తనతో పాటు కుటుంబ సభ్యులతో తరచూ గొడవ పడేదని సందీప్ కుమార్ ఝూ ఆరోపించారు. అంతేగాక, ఆమె సోదరుడు తన ఇంట్లో రూ. 65 వేలు దొంగిలించినట్లు సందీప్ కుమార్ ఫిర్యాదులో పేర్కొన్నారు. అప్పటి నుంచి పల్లవి ఝా ఆమె తండ్రి ప్రమోద్ ఝా, సోదరుడు ప్రంజాల్ ఝా తనను వేధింపులకు గురి చేస్తున్నట్లు సందీప్ తెలిపారు.
అంతేగాక, తప్పుడు ఆరోపణలతో బీహార్‌లో కేసులు నమోదు చేశారని ఐఏఎస్ అధికారి సందీప్ కుమార్ ఝా వాపోయారు. సొంతూరులోని తన ఇంటిపై దాడి చేసి కుటుంబ సభ్యులను కూడా గాయపరిచి.. వారిని బెదిరించినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. తనపై తప్పుడు ఆరోపణలతో తన భార్య, బామ్మర్ది, మామ.. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఉన్నతాధికారులకు మెయిల్ ద్వారా ఫిర్యాదులు చేస్తున్నారని సందీప్ కుమార్ తెలిపారు. నిందితులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని బంజారాహిల్స్ పోలీసులను ఆయన కోరారు. ఆయన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.












Click it and Unblock the Notifications