హైదరాబాదులోని ఈ ప్రాంతాలకు తాగు నీటి సరఫరా బంద్..!!
హైదరాబాద్: అసలే భారీ వర్షాలు హైదరాబాద్ నగరాన్ని కుదిపేస్తున్న వేళ భాగ్యనగర వాసులకు మరో షాక్ ఇచ్చింది హైదరాబాద్ మెట్రోపాలిటన్ వాటర్ సప్లయ్ అండ్ సీవరేజ్ బోర్డు. నగరంలోని పలు ప్రాంతాల్లో రేపు (సెప్టెంబర్ 24, బుధవారం) మంజీరా తాగునీటి సరఫరా నిలిచిపోనుంది. హైదరాబాద్ మెట్రోపాలిటన్ వాటర్ సప్లై అండ్ సీవరేజ్ బోర్డు (HMWSSB) చేపట్టిన మరమ్మత్తు పనుల కారణంగా ఈ అంతరాయం ఏర్పడుతుందని అధికారులు వెల్లడించారు. ప్రధానంగా మంజీరా ఫేజ్-2 ప్రాజెక్టులోని కాలాబ్‌గూర్ నుంచి హైదర్ నగర్ వరకు ఉన్న పంపింగ్ మెయిన్‌లో భారీ లీకులు ఏర్పడ్డాయి. వాటిని అరికట్టేందుకు బుధవారం ఉదయం 6 గంటల నుంచి గురువారం ఉదయం 6 గంటల వరకు 24 గంటల పాటు మరమ్మత్తులు జరగనున్నాయి.
ఈ కారణంగా, ఈ ప్రాంతాల్లో తాగునీటి సరఫరా నిలిచిపోవడంతో పాటు, ఒత్తిడి కూడా తగ్గుతుందని వాటర్ బోర్డు ఒక పత్రికా ప్రకటనలో తెలిపింది. మంజీరా నీటి సరఫరా వ్యవస్థకు ఇది చాలా ముఖ్యమైన ప్రాజెక్టు. గత కొంత కాలంగా ఈ మార్గంలో లీకుల వల్ల వేలాది లీటర్ల నీరు వృథా అవుతోంది. వేసవి కాలంలోనే కాకుండా,వర్షాకాలంలో కూడా ఈ లీకుల వల్ల సరఫరాలో ఒత్తిడి సమస్యలు ఎదురవుతున్నాయి.

నీటి సరఫరా నిలిచిపోయే ప్రాంతాలు ఇవే:
- RC పురం, అశోక్ నగర్, జ్యోతి నగర్, లింగంపల్లి, చందానగర్, గంగారం, మాదాపూర్, మియాపూర్, బీరంగూడ, అమీన్‌పూర్
- ఎర్రగడ్డ, ఎస్.ఆర్. నగర్, అమీర్‌పేట్
- KPHB కాలనీ, కూకట్‌పల్లి, భాగ్యనగర్ కాలనీ, ప్రగతి నగర్
ఈ ప్రాంతాల ప్రజలు ముందు జాగ్రత్తగా నీటిని నిల్వ చేసుకోవాలని HMWSSB సూచించింది. పనులను వీలైనంత త్వరగా పూర్తి చేసి, సాధారణ సరఫరాను పునరుద్ధరించడానికి అన్ని చర్యలు తీసుకుంటున్నామని అధికారులు తెలిపారు. నగర వాసులు ఈ సమస్యను అర్థం చేసుకొని సహకరించాలని బోర్డు విజ్ఞప్తి చేసింది.












Click it and Unblock the Notifications