viral video: యుద్ధం ఎఫెక్ట్.. హైదరాబాద్ లో పెట్రోల్ కోసం ఎగబడ్డ జనం..
పశ్చిమాసియా అట్టుడికిపోతుంది. ఇరాన్ పై ఇజ్రాయెల్- అమెరికా దాడులు కొనసాగిస్తోంది. మరోవైపు ఇరాన్‌పై సైనిక చర్య మరికొన్ని వారాలు కొనసాగే అవకాశం ఉందని తాజాగా అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రకటించారు. ఈ నేపథ్యంలో ఈ ఉద్రిక్తతలు ఇప్పట్లో తగ్గేలా లేవు. అయితే యుద్ధం భయం ఇప్పుడు ఆ దేశాలను దాటి భారత్ లోని హైదరాబాద్ కు చేరింది. యుద్ధం కారణంగా పెట్రోల్, డీజిల్ కొరత ఉంటుందని సోషల్ మీడియాలో వచ్చిన కొన్ని రూమర్స్ కారణంగా హైదరాబాద్ లోని పెట్రోల్ బంకుల వద్ద ఒక్కసారిగా రద్దీ పెరిగింది. పెట్రోల్ కోసం జనం ఎగబడ్డారు.
వాహనాల్లోనే కాకుండా పెద్ద పెద్ద బాటిల్స్ , క్యాన్స్ లో పెట్రోల్ నింపుకుని వెళ్లిపోతున్నారు. మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతల కారణంగా పెట్రోల్, డీజిల్ కొరత భారీగా ఉండబోతుందంటూ సామాజిక మాధ్యమాల్లో కొన్ని పోస్టులు చక్కర్లు కొట్టాయి. అయితే అది నిజమేనని భావించిన ప్రజలు ఒక్కసారిగా పెట్రోల్ బంకుల్లోకి దూసుకొచ్చారు. తమకు తోచినంత పెట్రోల్ కొనుగోలు చేసి వెళ్తున్నారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది.
మార్చి 2, సోమవారం రాత్రి తారావీ ప్రేయర్స్ తర్వాత.. పెద్ద సంఖ్యలో ప్రజలు స్థానిక పెట్రోల్ బంకుల్లో ఎగబడ్డారు. దాంతో పెట్రోల్ బంకుల వద్ద పెద్ద సంఖ్యలో క్యూలు ఏర్పాటయ్యాయి. వాహనాల్లోనే కాకుండా మరికొంతమంది క్యాన్లు, వాటర్ బాటిళ్లలో పెట్రోల్ ను నింపుకుని వెళ్తున్నారు. మరోవైపు ఇజ్రాయెల్- ఇరాన్ యుద్ధం కారణంగా ప్రపంచవ్యాప్తంగా ఆయిల్ ధరలు 9 శాతం పెరిగాయి. కానీ భారత్ లో రిటైల్ పెట్రోల్, డీజిల్ ధరల్లో మాత్రం ఎలాంటి తేడా కనిపించలేదు.

ఇక భారత్ దాదాపు 88 శాతం ముడి చమురును ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకుంటుంది. అక్కడినుంచి రిఫైనరీల ద్వారా పెట్రోల్, డీజిల్ గా మారుతుంది. ప్రపంచవ్యాప్తంగా ధరలు పెరిగినప్పుడు ఆ ప్రభావం దిగుమతి ధరలపై పడుతుంది. అయితే నిపుణుల అంచనా ప్రకారం.. హైదరాబాద్ తో పాటు రాష్ట్రంలోని ఇతర జిల్లాల్లోనూ ఇప్పటికప్పుడే పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగే అవకాశం కనిపించడం లేదు. ఇక ఏదేమైనా ప్రస్తుతం ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. ఈ వీడియో చూసిన నెటిజన్లు పలు విధాలుగా కామెంట్స్ చేస్తున్నారు.












Click it and Unblock the Notifications