ఆ ఇళ్లను మాత్రం కూల్చబోం: హైడ్రా కమిషనర్ రంగనాథ్ క్లారిటీ
హైదరాబాద్ నగరంలో అక్రమ నిర్మాణాలపై విరుచుకుపడుతున్న హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్స్ ప్రొటెక్షన్ ఏజెన్సీ(Hydra) కీలక నిర్ణయం తీసుకుంది. చెరువులు, కుంలు, నాలాలను ఆక్రమించి నిర్మించిన కట్టడాలను హైడ్రా గంటల వ్యవధిలోనే కూల్చివేస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో అక్రమ కట్టడాల కూల్చివేతపై హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ స్పష్టతనిచ్చారు.
ఎఫ్‌టీఎల్, బఫర్‌జోన్‌లో వచ్చే కొత్త నిర్మాణాలను మాత్రమే కూలుస్తున్నామని కమిషనర్ తెలిపారు. బఫర్‌జోన్, ఎఫ్‌టీఎల్ పరిధిలో ఇప్పటికే నిర్మించి, అందులో ఎవరైనా నివాసం ఉంటే ఆ ఇళ్లను పడగొట్టబోమని స్పష్టం చేశారు.
ప్రస్తుతం నిర్మాణ దశలో ఉంటే మాత్రం కూల్చేస్తామని తెలిపారు. మల్లంపేట చెరువులో కూల్చివేస్తున్న భవనాలు నిర్మాణదశలో ఉన్నాయని, బఫర్‌జోన్‌లో అనుమతులు లేకుండా నిర్మిస్తున్నారని చెప్పారు.

సున్నం చెరువులో నిర్మించిన కొన్నిషెడ్లు వాణిజ్యపరంగా వినియోగిస్తున్నారని, గతంలో కూడా వాటిని కూల్చినట్లు కమిషనర్ రంగనాథ్ తెలిపారు. మళ్లీ నిర్మాణాలు చేపట్టడంతోనే ఇప్పుడు కూల్చివేస్తున్నట్లు పేర్కొన్నారు. బిల్డర్ విజయలక్ష్మిపై క్రిమినల్ కేసులు నమోదు చేశామన్నారు. మాజీ ఎమ్మెల్యే కాటసాని భూపాల్‌రెడ్డిపై కూడా క్రిమినల్ కేసులు నమోదు చేసినట్లు తెలిపారు.
అయితే, ఆక్రమణలో ఉన్న ఏ ఇంటినీ కూల్చబోమని ప్రజలందరికీ హామీ ఇస్తున్నట్లు కమిషనర్ రంగనాథ్ స్పష్టం చేశారు. అదేవిధంగా ఎఫ్‌టీఎల్, బఫర్‌జోన్‌లో ఉన్న స్థలాలు, ఇళ్లు మాత్రం కొనుగోలు చేయొద్దని ఏవీ రంగనాథ్ ప్రజలకు సూచించారు. మరోవైపు, నగరంలో అక్రమ నిర్మాణల కూల్చివేతలు కొనసాగుతున్నాయి. మాదాపూర్ సున్నం చెరువు ఎఫ్‌టీఎల్ లోని ఐదు అంతస్తుల భవనం సహా మూడు అంతస్తుల ఇంటిని కూల్చివేశారు. వీటితోపాటు ఎఫ్‌టీఎల్, బఫర్ జోన్‌లో ఏర్పాటు చేసిన 15 షెడ్లు, 20కిపైగా గుడిసెలు, ఒక హోటల్‌ను కూడా హైడ్రా అధికారులు కూల్చివేశరు.












Click it and Unblock the Notifications