వాటి కూల్చివేత పక్కా: హైడ్రా కమిషనర్ రంగనాథ్ సంచలన వ్యాఖ్యలు
హైదరాబాద్ నగరంలో అక్రమ నిర్మాణాలు, చెరువుల ఆక్రమణల తొలగింపుతో హాట్ టాపిక్‌గా మారిన హైడ్రా కమిషనర్ రంగనాథ్ తాజాగా సంచలన వ్యాఖ్యలు చేశారు. చెరువులను పునరుద్ధరించాలంటే ఇళ్లను కూల్చాల్సిన అవసరం లేదన్నారు. ఎఫ్‌టీఎల్ పరిధిలో ఉన్న అక్రమ నిర్మాణాలు తొలగించడంతోపాటు, చెరువుల్లోకి కొత్త నిర్మాణాలు రాకుండా అడ్డుకోవడమే తమ బాధ్యత అని రంగనాథ్ స్పష్టం చేశారు.
అమీన్‌పూర్ చెరువు తూములు మూసివేయడం వల్లే లేఅవుట్లు మునిగాయని అన్నారు. ఎఫ్‌టీఎల్ లెవెల్ పరిగణలోకి తీసుకుని చెరువులు సర్వే చేయిస్తామన్నారు. తప్పుడు అనుమతులు ఇచ్చినవి, అనుమతులు రద్దు చేసిన ఇళ్లను మాత్రమే హైడ్రా కూల్చివేసిందని తెలిపారు. అనుమతులు లేకుండా ఉన్న ఇళ్లు.. పెద్దవాళ్లవైనా, పేదలవైనా కూల్చక తప్పదని రంగనాథ్ తేల్చి చెప్పారు. కొంతమందిపై చర్యలు తీసుకోవడం వల్లే హైడ్రా చేసే పని అందరికీ తెలిసిందన్నారు.

ప్రజల్లో ఇప్పుడు ఎఫ్‌టీఎల్, బఫర్ జోన్లపై అవగాహన వచ్చిందని, దీనిపై చర్చ కూడా జరుగుతోందని రంగనాథ్ తెలిపారు. అక్రమ నిర్మాణాల విషయంలో మానవత్వంతో ఆలోచిస్తే సమాజమంతా బాధపడాల్సి వస్తుందన్నారు. అందుకే కొన్నిసార్లు మనసును చంపుకుని పని చేయాల్సి వస్తోందని హైడ్రా కమిషనర్ రంగనాథ్ తెలిపారు. ఎఫ్‌టీఎల్ పరిధి నిర్ధరించాక నిర్మాణం చేపడితే అలర్ట్ వస్తుందన్నారు.
అక్రమ నిర్మాణాల నియంత్రణకు అత్యాధునిక సాంకేతికతను వినియోగిస్తున్నామని రంగనాథ్ తెలిపారు. ఇప్పటి వరకు ఎన్నో ఆక్రమణలు జరిగాయని, ఇకపై అలా జరగకుండా అడ్డుకోవడమే ప్రభుత్వ ఉద్దేశమని తెలిపారు. హైడ్రా పనితీరు కారణంగా ప్రజల్లో అవగాహన పెరిగిందన్నారు. చెరువులు ఆక్రమణలకు గురికాకుండా స్థానికులు కూడా నిఘా పెడుతున్నారని రంగనాథ్ వెల్లడించారు.
శుక్రవారం నిర్వహించిన బ్రెయిన్ స్టార్మింగ్ సమావేశంలో ఇరిగేషన్, వాటర్ రిలేటెడ్ శాఖల్లో పనిచేసి రిటైర్ అయిన అనుభవజ్ఞులైన అధికారుల సూచనలు తీసుకున్నామన్నారు. చెరువుల పరిరక్షణ కోసం అవసరమైన చర్యలు చేపడతామన్నారు హైడ్రా కమిషనర్ రంగనాథ్.












Click it and Unblock the Notifications