N Convention: ఎన్ కన్వెన్షన్ కూల్చివేతపై హైకోర్టు ఆదేశాలు ఒట్టిదే-హైడ్రా కమిషనర్ క్లారిటీ
తెలంగాణలోని రేవంత్ రెడ్డి సర్కార్ గచ్చిబౌలిలో చేపట్టిన అక్కినేని నాగార్జునకు చెందిన ఎన్ కన్వెన్షన్ సెంటర్ కూల్చివేతలపై హైకోర్టు ఇవాళ మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చినట్లు ప్రచారం జరిగింది. అక్రమ కట్టడం పేరుతో తన కన్వెన్షన్ సెంటర్ ను ఇవాళ కూల్చివేయడాన్ని సవాల్ చేస్తూ అక్కినేని నాగార్జున హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారణ జరిపిన హైకోర్టు.. మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసినట్లు ప్రచారం జరిగింది. దీన్ని హైడ్రా ఖండించింది.

అంతకు ముందు ఇవాళ ఉదయం నుంచే ఎలాంటి నోటీసులు లేకుండా గచ్చిబౌలిలోని ఎన్ కన్వెన్షన్ సెంటర్ ను హైడ్రా అధికారులు కూల్చేయడం మొదలుపెట్టారు. తమ్మిడి కుంట చెరువును ఆక్రమించి ఎన్ కన్వెన్షన్ సెంటర్ నిర్మించడం వల్ల అక్రమ కట్టడంగా గుర్తించి కూల్చేస్తున్నట్లు వెల్లడించారు. దీనిపై అక్కినేని నాగార్జున స్పందిస్తూ చట్టవిరుద్ధంగా చేపట్టిన కూల్చివేతల వ్యవహారం పై కోర్టులోనే తేల్చుకుంటానన్నారు.
దీనిపై విచారణ జరిపిన తెలంగాణ హైకోర్టులోని జస్టిస్ టి వినోద్ కుమార్ ధర్మాసనం కూల్చివేతలపై హైడ్రా అధికారుల నుంచి వివరాలు తీసుకుంది. అయితే ఎలాంటి మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయలేదు. ఈ విషయాన్ని హైడ్రా కమిషనర్ రంగనాథ్ వెల్లడించారు. కూల్చివేతలు ఆపాలని హైకోర్టు ఆదేశాలు ఇచ్చినట్లు వస్తున్న వార్తల్లో నిజం లేదన్నారు. ఎన్ కన్వెన్షన్ ను పూర్తిగా చెరువును ఆక్రమించి కట్టారని, కాబట్టి ఇందులో నిర్మాణాలను పూర్తిగా నేలమట్టం చేశామన్నారు.












Click it and Unblock the Notifications