మండుతున్న ఎండల వేళ.. ఈదురు గాలులతో భారీ వర్షాలు- తాజా హెచ్చరిక..!!
తెలుగు రాష్ట్రాల్లో భిన్న వాతావరణం నెలకొంది. రానున్న నాలుగు రోజుల్లో వడగాల్పుల తీవ్రత ఎక్కువగా ఉంటుందని వాతావరణ శాఖ వెల్లడించింది. రికార్డు ఉష్ణోగ్రతలు నమోదు అవుతాయని పేర్కొంది. ఇదే సమయంలో ద్రోణి కారణంగా రానున్న మూడు రోజుల్లో పలు ప్రాంతాల్లో ఈదురు గాలులతో వర్షాలు కురుస్తాయని అంచనా వేసింది. ఈ మేరకు తాజా అలర్ట్స్ జారీ చేసింది. ఇప్పటి కే రుతుపవనాలు అండమాన్ లోకి ప్రవేశించాయి. ఈ నెల 26న కేరళలో.. జూన్ తొలి వారంలో తెలుగు రాష్ట్రాల్లోకి రుతుపవనాలు ప్రవేశించే అవకాశం ఉంది.
నుడి భగభగలతో ఉడికిపోతున్న తెలంగాణ ప్రజలకు వాతావరణ శాఖ చల్లని వార్త చెప్పింది. రాష్ట్రవ్యాప్తంగా ఎండల తీవ్రత గరిష్ట స్థాయికి చేరి, సామాన్యులు ఉక్కిరిబిక్కిరి అవుతున్న వేళ.. నైరుతి రుతుపవనాలు పలకరించబోతున్నాయి. ఇప్పటికే అండమాన్ సముద్రంలోకి నైరుతి మేఘాలు ప్రవేశించాయని, మరో 24 గంటల్లో ఇవి దక్షిణ అండమాన్‌ను తాకనున్నాయని వాతావరణ కేంద్రం వెల్లడించింది. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో కొనసాగుతున్న అల్పపీడనం ఉత్తర ఈశాన్య దిశగా కదులుతూ రుతుపవనాల కదలికకు బాగా సహకరిస్తోంది. రుతుపవనాల రాక కంటే ముందే ద్రోణి కారణంగా అక్కడక్కడా వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. ముఖ్యంగా భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, మహబూబాబాద్, నారాయణపేట జిల్లాల్లో నేడు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే ఛాన్స్ ఉంది.

ఈదురుగాలులతో భారీ వర్షాలు.. తాజా హెచ్చరిక
వర్షం పడే సమయంలో గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీస్తాయని, ఉరుములు మెరుపులతో కూడిన వానలు పడతాయని హెచ్చరించారు. ఈ వర్షాల వల్ల ఎండల నుంచి తాత్కాలికంగా ఉపశమనం లభించనుంది. రుతుపవనాలు వచ్చే వరకు .. రానున్న వారం రోజులు రాష్ట్రంలో ఎండల తీవ్రత ఇలాగే కొనసాగుతుందని వాతావరణ శాఖ స్పష్టం చేసింది. శనివారం ఆదిలాబాద్, నిర్మల్, నిజామాబాద్, ఆసిఫాబాద్ జిల్లాల్లో 44 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఉదయం 9 గంటల నుంచే ఎండ ప్రభావం ఉండటంతో జనం బయటకు రావడానికి భయపడుతున్నారు. మధ్యాహ్నం వేళ వేడి గాలులు వీస్తుండటంతో వడదెబ్బ తగిలే ప్రమాదం ఉందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. వడగాల్పులు.. వర్షాల హెచ్చరికలతో నెలకున్న భిన్న వాతావరణం వేళ అవసరమైన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు వెల్లడించారు.













Click it and Unblock the Notifications