Red Alert : మే 19 నుంచి చాలా డేంజర్.. అస్సలు బయటకు రావద్దు
తెలుగు రాష్ట్రాల ప్రజల్లారా జాగ్రత్త! మునుపెన్నడూ లేని విధంగా రాబోయే వారం రోజుల పాటు ఎండలు ఠారెత్తించనున్నాయి. భానుడి భగభగలకు తోడుగా వడగాలులు (Heat Waves) కూడా తోడవ్వడంతో జనజీవనం అతలాకుతలం కానుంది. ముఖ్యంగా ఈ నెల 19 నుంచి 24వ తేదీ మధ్య ఉష్ణోగ్రతలు గరిష్ఠ స్థాయికి చేరుకోనున్నాయని వాతావరణ శాఖ తీవ్ర హెచ్చరికలు జారీ చేసింది. సగటు ఉష్ణోగ్రతలు ఏకంగా 45 డిగ్రీల మార్కును దాటే ప్రమాదం ఉందని స్పష్టం చేసింది. ఎండల తీవ్రత దృష్ట్యా ఉదయం 10.30 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు అత్యవసరమైతే తప్ప ప్రజలు ఎవరూ ఇళ్ల నుంచి బయటకు రావద్దని సూచిస్తున్నారు.
తెలంగాణలో ఎండల తీవ్రత ఒక్కసారిగా ప్రమాదకర స్థాయికి చేరుకుంది. ఉష్ణోగ్రతలు అసాధారణంగా పెరుగుతుండటంతో అధికారులు అత్యంత అప్రమత్తత ప్రకటించారు. ఎండల తీవ్రత రికార్డు స్థాయిలో ఉండటంతో ఆదిలాబాద్, కుమురం భీం ఆసిఫాబాద్, నిర్మల్, జగిత్యాల, మంచిర్యాల జిల్లాలకు వాతావరణ శాఖ 'రెడ్ అలర్ట్' జారీ చేసింది. ఎండ తీవ్రత ఎక్కువగా ఉండే మరో 16 జిల్లాలకు 'ఆరెంజ్ అలర్ట్' ప్రకటించారు. ఈ ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు 41 నుంచి 44 డిగ్రీల వరకు నమోదయ్యే అవకాశం ఉంది. సోమవారం (25వ తేదీ) నాటికి కనీసం ఏడు జిల్లాల్లో ఎండలు 45 డిగ్రీల మార్కును దాటిపోతాయని అధికారులు ముందస్తుగా హెచ్చరిస్తున్నారు.

బయటకు వెళ్తున్నారా? వైద్యుల కీలక సూచనలు
ఈ కఠినమైన వేసవి పరిస్థితుల్లో వడదెబ్బ బారిన పడకుండా ఉండటానికి వైద్య నిపుణులు కొన్ని ముఖ్యమైన రక్షణ చర్యలను సూచించారు. ఎండలో బయటకు వెళ్లాల్సి వస్తే తలకు టోపీ లేదా కాటన్ టవల్ తప్పనిసరిగా కట్టుకోవాలి. వేడి గాలి ముక్కు, చెవుల ద్వారా శరీరంలోకి వెళ్లకుండా కర్చీఫ్ అడ్డుగా కట్టుకోవడం మంచిది. కేవలం నూలు (కాటన్) వస్త్రాలను మాత్రమే ధరించాలి.
హైడ్రేషన్ ముఖ్యం:..
ఎండ వేడికి ఒంట్లోని చెమట రూపంలో ఎలక్ట్రోలైట్స్ వేగంగా కరిగిపోతాయి. దీనివల్ల తీవ్రమైన అలసట, నీరసం వస్తాయి. కాబట్టి దాహం వేయకపోయినా వీలైనంత ఎక్కువ నీరు తాగుతూ ఉండాలి. మజ్జిగ, కొబ్బరి నీళ్లు, ఓఆర్‌ఎస్ (ORS) ద్రావణం ఎక్కువగా తీసుకోవాలి. ఇంట్లోనే నిమ్మరసంలో కొద్దిగా ఉప్పు, చక్కెర కలుపుకుని తాగడం వల్ల తక్షణ శక్తి లభిస్తుంది.
హై-రిస్క్ గ్రూపులు..
గర్భిణులు, చిన్న పిల్లలు, వృద్ధులతో పాటు దీర్ఘకాలిక వ్యాధులతో (బిపి, షుగర్ వంటివి) బాధపడేవారు ఈ వారం రోజుల పాటు మరింత అప్రమత్తంగా ఉండాలి. ముఖ్యంగా కొన్ని రకాల బీపీ మందులు వాడేవారికి మూత్ర విసర్జన ఎక్కువగా జరిగి సోడియం, పొటాషియం లవణాలు పోతుంటాయి. వీరు నీటిని మరింత ఎక్కువగా తీసుకోవాలి.
రేకుల ఇళ్లలో ఉండేవారు ఏం చేయాలి?
డైరెక్ట్‌గా ఎండ తాకే ఇళ్లలో నివసించేవారు, రేకుల షెడ్లలో ఉండేవారు వేడి గాలుల ప్రభావం తగ్గించుకోవడానికి తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. మధ్యాహ్న సమయాల్లో వేడి గాలి లోపలికి రాకుండా కిటికీలకు అడ్డుగా తడి తెరలు వాడొచ్చు. అలాగే రేకులపై గడ్డి లేదా జనపనార (గోనె) సంచులు వేసి వాటిపై నీళ్లు చల్లడం ద్వారా ఇంటి లోపల వేడిని చాలావరకు తగ్గించుకోవచ్చు.
వడదెబ్బ తగిలితే తక్షణ చికిత్స ఇదే..
ఒకవేళ ఎవరైనా ఎండ తీవ్రతకు అస్వస్థతకు గురైతే (వడదెబ్బ తగిలితే) కంగారు పడకుండా వెంటనే ఈ క్రింది ప్రథమ చికిత్స అందించాలి.
- బాధితుడిని వెంటనే ఎండలో నుంచి నీడగా ఉన్న చల్లటి ప్రదేశానికి లేదా గాలి ఆడే గదిలోకి మార్చాలి.
- శరీరాన్ని చల్లబరచడానికి తల నుంచి కాళ్ల వరకు తడి గుడ్డతో పూర్తిగా తుడవాలి.
- వ్యక్తి కాస్త తేరుకుని స్పృహలోకి వచ్చిన తర్వాత ఓఆర్‌ఎస్ ద్రావణాన్ని నెమ్మదిగా తాగించాలి.
ఒకవేళ బాధితుడు తీవ్రమైన వాంతులు, విరేచనాలతో బాధపడుతుంటే ఏమాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే సమీపంలోని ఆసుపత్రికి తరలించి వైద్య సహాయం అందించాలి.














Click it and Unblock the Notifications