Kanti Velugu: కంటి వెలుగు కింద 1,58,54,982 కోట్ల మందికి పైగా కంటి పరీక్షలు..
తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా 'కంటి వెలుగు' కార్యక్రమం చేపట్టింది. కంటి వెలుగు కింద ఇప్పటివరకు 1,58,54,982 కోట్ల మందికి పైగా కంటి పరీక్షలు నిర్వహించినట్లు ప్రభుత్వం శనివారం తెలిపింది. రాష్ట్రవ్యాప్తంగా కంటి వెలుగు వైద్య శిబిరాల్లో ఇప్పటి వరకు 21,85,945 మందికి రీడింగ్ గ్లాసెస్ అందజేశారు.అంధత్వ రహిత తెలంగాణ నినాదంతో ప్రారంభమైన ఈ కార్యక్రమం రాష్ట్రవ్యాప్తంగా 11, 862 గ్రామ పంచాయతీ వార్డులు, 3495 మున్సిపల్ వార్డుల్లో విజయవంతంగా నిర్వహించారు.
కంటి చూపు లోపాలను సరిదిద్దేందుకు 2018 ఆగస్టు 15న ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు మెదక్ జిల్లా మల్కాపూర్‌లో కంటి వెలుగు మొదటి దశ కార్యక్రమాన్ని ప్రారంభించారు. 8 నెలల పాటు సాగిన ఈ కార్యక్రమంలో కోటి 50 లక్షల మందికి ఉచితంగా కంటి పరీక్షలు నిర్వహించడంతో పాటు 50 లక్షల మందికి కళ్లద్దాలు పంపిణీ చేశారు. ఆ తర్వాత జనవరి 18న ఖమ్మంలో రెండో దశ కంటి వెలుగు కార్యక్రమం 84 రోజుల వ్యవధిలో రాష్ట్రంలో 92.75 శాతం మందికి కంటి పరీక్షలు చేయించుకున్నారు.

వైద్యశాఖ, పంచాయతీరాజ్, మున్సిపల్ తదితర శాఖలతోపాటు ప్రజాప్రతినిధులందరూ ఇందులో పాల్గొంటున్నారు. పర్యవేక్షణ కోసం ప్రభుత్వం రాష్ట్ర స్థాయి, జిల్లా స్థాయిలో క్వాలిటీ కంట్రోల్ టీమ్‌లను ఏర్పాటు చేసింది. అన్ని జిల్లాల్లోని శిబిరాల్లో నమోదైన గణాంకాలను దగ్గరగా చూడలేక ఇబ్బంది పడుతున్న వారు ఎక్కువ మంది ఉన్నారని తేలిందని ప్రభుత్వం తెలిపింది. 40 ఏళ్లు దాటిన చాలా మందికి కంటి సమస్య ఉందని అధికారులు తెలిపారు. అలాంటి వారికి వెంటనే రీడింగ్ గ్లాసెస్ అందజేసినట్లు చెప్పారు.
వీటితోపాటు కంటి సమస్యలతో వస్తున్న పలువురికి విటమిన్ ఎ, డి, బి కాంప్లెక్స్ మాత్రలను పంపిణీ చేస్తున్నారు. 50 ఏళ్లు పైబడిన వారు ఎక్కువగా కంటి శుక్లాలతో బాధపడుతున్నారు. వైద్యసేవలు అవసరమైన వారికి మొబైల్ ఫోన్ల ద్వారా వైద్యం చేసే సమయానికి సంబంధించిన సమాచారాన్ని తెలియజేస్తున్నామని వైద్య సిబ్బంది తెలిపారు.












Click it and Unblock the Notifications