Holiday: సోమవారం రాష్ట్రవ్యాప్తంగా విద్య సంస్థలన్నింటీకి సెలవు..
తెలంగాణ వ్యాప్తంగా గత మూడు రోజులుగా ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తోన్నాయి. ముఖ్యంగా ఉమ్మడి ఖమ్మం, వరంగల్, నల్గొండ, మహబూబ్ నగర్ జిల్లాల్లో అత్యంత భారీ వర్షాలు కురిశాయి. ఈ భారీ వర్షాలు సోమవారం కూడా కురిసే అవకాశం ఉన్న వాతావరణ శాఖ తెలిపింది. దీంతో తెలంగాణ ప్రభుత్వం అప్రమత్తమైంది. పాఠశాలలకు వెళ్లే పిల్లలు ఇబ్బందులు పడకుండా ఉండేందుకు సోమవారం రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ, ప్రైవేట్ విద్యా సంస్థలన్నింటీకి రేపు (సోమవారం) సెలవు ప్రకటించింది.
ఈ మేరకు రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఒక ప్రకటన చేశారు. అలాగే ప్రభుత్వ విభాగాలకు సెలవులు రద్దు చేస్తున్నట్లు విరించారు. రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తోన్న నేపథ్యంలో సహయక చర్యలకు ఆటంకాలు ఏర్పడకుండా అన్ని గవర్నమెంట్ డిపార్ట్మెంట్లకు సెలవులు క్యాన్సిల్ చేసినట్లు ప్రకటించారు. భారీ వర్షాల నేపథ్యంలో అధికారులతో ఎప్పటికప్పుడు సమీక్ష నిర్వహిస్తున్నామని తెలిపారు.

ప్రజలు అనవసరంగా బయటకు రావొద్దని మంత్రి కోరారు. ప్రమాదకరమైన రోడ్లపైకి వాహనాలు వెళ్లకుండా నిలిపివేయాలని పోలీసులను ఆదేశించినట్లు వివరించారు. అత్యంత భారీ వర్షాలతో ఉమ్మడి ఖమ్మం, వరంగల్ జిల్లాల్లో తీవ్ర నష్టం ఏర్పడిందని పేర్కొన్నారు.
బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం ప్రభావంతో తెలంగాణ వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయని వాతావరణ శాఖ తెలిపింది.
వాతావరణ శాఖ తెలంగాణలోని మహబూబ్‌నగర్, నాగర్‌కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల, నిజామాబాద్, కామారెడ్డి, ఆదిలాబాద్, నిర్మల్ జిల్లాలకు రెడ్ అలెర్ట్ జారీ చేసింది. భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, కుమురం భీం, మంచిర్యాల, జగిత్యాల, జయశంకర్, ములుగు, వరంగల్, హనుమకొండ, జనగామ, వికారాబాద్, సంగారెడ్డి జిల్లాల్లో ఆరెంజ్ అలెర్ట్ జారీ చేయగా.. నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, సిద్దిపేట,రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, యాదాద్రి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజిగిరి, మెదక్ జిల్లాలకు ఎల్లో అలెర్ట్ జారీ చేసింది.












Click it and Unblock the Notifications