ఖమ్మంలో అమిత్ షాతో బీజేపీ బలప్రదర్శన అందుకేనా?
ఖమ్మం రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి. ఇప్పటికే ఖమ్మంలో పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరుతారని పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. పొంగులేటి బీజేపీలో చేరక పోవడం వెనక స్థానికంగా బీజేపీకి బలం లేదని కూడా ఆసక్తికర చర్చ జరుగుతోంది. అయితే ఇదే సమయంలో ఖమ్మంలో బీజేపీ తన సత్తా చాటాలని, బలప్రదర్శనకు రెడీ అయింది.
ఖమ్మం వేదికగా బీజేపీ అగ్రనేత అమిత్ షా తో బహిరంగ సభను నిర్వహించి ఖమ్మంలో కమలం పార్టీ తన బలాన్ని నిరూపించుకోబోతోంది. తెలంగాణ రాష్ట్రంలో నాలుగైదు నెలల్లో ఎన్నికల నోటిఫికేషన్ రానున్న నేపథ్యంలో పార్టీలో జోష్ నింపటానికి, పార్టీని బలోపేతం చేయడానికి, బిజెపి అధినాయకత్వం తెలంగాణపై ఫోకస్ చేస్తుంది అని చెప్పడానికి బీజేపీ అగ్రనేతలు తెలంగాణలో పర్యటించనున్నారు.

ఈ క్రమంలోనే ఖమ్మంలో ఈనెల 15వ తేదీన బీజేపీ అగ్రనేత, కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా పర్యటించనున్నారు. భారీ బహిరంగ సభలో ఆయన మాట్లాడనున్నారు. ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం సూర్యాపేట, మహబూబాద్ జిల్లాలనుంచి లక్షమంది నాయకులను తరలించి తమ సత్తా చాటాలని బిజెపి నాయకులు సిద్ధమయ్యారు. సభ విజయవంతం చేయడానికి సీనియర్ నాయకులతో కమిటీ వేసి ఈ సభ ద్వారా బీజేపీ బలాన్ని తెలియజేయాలని బీజేపీనేతలు భావిస్తున్నారు.
ఖమ్మంలో బీఆర్ఎస్ పార్టీ అనుకున్నంత బలంగా లేకపోవడంతో, ఖమ్మంపై గట్టిగానే ఫోకస్ పెట్టాలని భావిస్తున్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత జరిగిన రెండు ఎన్నికల్లోనూ ఖమ్మంలో బీఆర్ఎస్ కు ఎదురు గాలి వీచింది. రాష్ట్రమంతా ఓ రకమైన తీర్పు ఇస్తే, ఖమ్మం జిల్లా ఓటర్లు మాత్రం బీఆర్ఎస్ కు షాక్ ఇచ్చారు.

ఈ క్రమంలో ఖమ్మం పై ఫోకస్ చేస్తే ఫలితం ఉంటుందని భావిస్తున్న బీజేపీ అంగబలం, అర్థబలం ఉన్న నేత పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిని పార్టీలోకి తీసుకురావాలని ప్రయత్నం చేసింది. అయితే స్థానికంగా ఉన్న రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో, ఖమ్మంలో స్థానికంగా కాంగ్రెస్ పార్టీ బలంగా ఉండడంతో పొంగులేటి కాంగ్రెస్ వైపే మొగ్గు చూపారు.
పొంగులేటి కాంగ్రెస్ లో చేరాలని నిర్ణయం తీసుకోవడంతో బిజెపికి అక్కడ పట్టు లేదు అన్న చర్చ జరుగుతోంది. ఈ సమయంలో బిజెపి అమిత్ షా బహిరంగ సభ ద్వారా ఖమ్మం పై పట్టు సాధించాలని ప్రయత్నం చేస్తోంది. అందుకే లక్ష మందిని తరలించి ఈ సభ ద్వారా బిజెపి బలప్రదర్శన చేయనుంది.












Click it and Unblock the Notifications