ఆత్మహత్య: ఐఐటి హైదరాబాద్ విద్యార్థి, కాశ్మీర్‌వాసి
హైదరాబాద్: హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయంలో శుక్రవారం సాయంత్రం ఆత్మహత్య చేసుకున్న 28 ఏళ్ల తారిఖుల్ ఇస్లామ్ జమ్మా కాశ్మీర్ రాష్ట్రానికి చెందినవాడు. అతను ఐఐటి హైదరాబాదులో చదువుతున్నాడు. అతను శుక్రవారం సాయంత్రం హాస్టల్ గదిలో పైకప్పునకు వేలాడుతూ కనిపించాడు. పోలీసులకు ఏ విధమైన సూసైడ్ నోట్ కూడా లభించలేదు.
జమ్మూ కాశ్మీర్ రాష్ట్రంలోని బారాముల్లా జిల్లాకు చెందిన ఇస్లామ్ మెదక్ జిల్లాలో ఉన్న ఐఐటి హైదరాబాదులో పిహెచ్‌డి చేస్తున్నాడు. హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయం (హెచ్‌సియు)లో అతనికి పలువురు మిత్రులు ఉన్నారు. వారిని చూడడానికి కొద్ది రోజుల క్రితం ఇక్కడికి వచ్చాడు. ఖాళీగా ఉన్న గదిలో దేనిలోనైనా నమాజు చేసుకుంటానని శుక్రవారం సాయంత్రం అతను మిత్రులకు చెప్పాడు.

గదికి లోపలి నుంచి గొల్లెం పెట్టి, నైలాన్ తాడుతో ఇస్లామ్ ఉరి వేసుకున్నాడు. అతని ఆత్మహత్యకు తగిన కారణాలను తాము చెప్పలేమని మిత్రులు అంటున్నారు. కానీ డిప్రెషన్‌లో ఉన్నట్లు మాత్రం అనిపించాడని చెబుతున్నారు. కొద్ది రోజుల్లో అతనికి ఐఐటి హైదరాబాద్‌లో అకడమిక్ ప్రజంటేషన్ ఉంది.

తమకు ఏ విధమైన సూసైడ్ నోట్ లభించలేదని, ఆత్మహత్యకు గల కారణాలను మిత్రులు కూడా చెప్పలేకపోతున్నారని పోలీసులు అంటున్నారు. ఇస్లామ్ తండ్రి గులాం మొహ్మద్ దోభీకి సమాచారం అందించారు. ఇస్లామ్ మృతదేహాన్ని ఉస్మానియా జనరల్ ఆస్పత్రికి తరలించారు.












Click it and Unblock the Notifications