కాంగ్రెస్ అధిష్ఠానంపై జంగా రాఘవ రెడ్డి హాట్ కామెంట్స్
తెలంగాణా రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీలో ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. తాజాగా వరంగల్ పశ్చిమ నియోజకవర్గం టికెట్ తనకు కేటాయించకపోవటంతో కాంగ్రెస్ అధిష్ఠానం పై జంగా రాఘవ రెడ్డి హాట్ కామెంట్స్ చేశారు. తాను యుద్ధానికి ఆయుధంతో సిద్ధంగా ఉన్నానని, వరంగల్ పశ్చిమ ప్రజలు తనను గెలిపించటానికి సిద్ధంగా ఉన్నారన్నారు.
కొత్తగా వచ్చిన రేవూరికి, నాగరాజుకు, యశస్వినికి టికెట్లు ఇచ్చారని, నాకు మాత్రం ఇవ్వలేదని మండిపడ్డారు. తాను పార్టీ మీటింగ్స్ కు కోట్ల రూపాయలు ఖర్చు చేశానని, అయినా పార్టీ తనను గుర్తించలేదని అన్నారు. తనపై కుట్ర జరిగిందని, అందుకే తనకు టికెట్ కేటాయించలేదని జంగా రాఘవరెడ్డి ఆరోపించారు. నాయిని రాజేందర్ రెడ్డి ఒక బ్రోకర్, ఒక అసమర్ధుడని మండిపడ్డారు జంగా రాఘవరెడ్డి.

కాకతీయ యూనివర్సిటీ భూములు అమ్ముకున్న నాయిని రాజేందర్ రెడ్డికి టికెట్ ఇచ్చారని మండిపడ్డారు. అసలు ఏ సర్వే ప్రకారం నాయినికి, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి టికెట్ ఇచ్చారో చెప్పాలన్నారు. కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నా అందుకు తగ్గట్టుగా అభ్యర్థుల ఎంపిక జరగలేదన్నారు. ఒక అసమర్థుడికి టికెట్ ఇచ్చారని జంగా రాఘవ రెడ్డి మండిపడ్డారు.
స్వలాభం కోసం పార్టీని నాశనం చేయవద్దన్నారు. కాంగ్రెస్ పార్టీని మోసం చేయలేదని, ప్రజల్ని మోసం చేయలేదని భద్రకాళి అమ్మవారి మీద నేను ప్రమాణం చేస్తానని, నాయిని రాజేందర్ రెడ్డి సిద్ధమా అంటూ ప్రశ్నించారు. తన కార్యకర్తల సూచనల మేరకు నిర్ణయం తీసుకుంటానని, మొత్తం 6 నియోజకవర్గాలలో తన అభ్యర్థులు ఉంటారని, ఏదో ఒక పార్టీ మద్దతు తీసుకుంటానని జంగా రాఘవరెడ్డి పేర్కొన్నారు.
వరంగల్ పశ్చిమ నియోజకవర్గం లో వినయ్ భాస్కర్ కు తనకే పోటీ ఉంటుందని, ఎల్లుండి తన భవిష్యత్తు కార్యాచరణ ప్రకటిస్తానని జంగా రాఘవరెడ్డి వెల్లడించారు. కచ్చితంగా ఎన్నికల బరిలో ఉంటానని ప్రకటించారు. పార్టీ కోసం అహర్నిశలు కష్టపడితే తనకు కాంగ్రెస్ లో అన్యాయం జరిగిందని ఆయన కంటతడి పెట్టారు.












Click it and Unblock the Notifications