రేవంత్ సర్కార్ ను టార్గెట్ చేసిన జీవన్ రెడ్డి, తొలి అస్త్రం - తాజా డిమాండ్..!!
కాంగ్రెస్ ప్రభుత్వం పై సీనియర్ నేత ధిక్కార స్వరం. నాలుగు దశాబ్దాల సీనియర్ నేత ఇప్పుడు ప్రభుత్వం పైన తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. రైతుల సమస్యల పైన ప్రభుత్వాన్ని నిలదీయటం సంచలనంగా మారుతోంది. పార్టీ వీడాలని నిర్ణయించిన జీవన్ రెడ్డి.. ఇంకా కాంగ్రెస్ కు రాజీనామా చేయకముందే నిరసన కు దిగారు. రైతుల సమస్యల పరిష్కారంలో రేవంత్ సర్కార్ నిర్లక్ష్యం చేస్తుందని ఆరోపించారు. ఇప్పుడు ఈ వ్యవహారం రాష్ట్ర రాజకీయాల్లో సంచలనంగా మారుతోంది.
కాంగ్రెస్ సీనియర్ నేత పార్టీ వీడటం ఖాయంగా కనిపిస్తోంది. ఇప్పటికే బీఆర్ఎస్ తో టచ్ లోకి వెళ్లిన ఆయన ఈ నెల 25న పార్టీకి రాజీనామా చేసేందుకు సమాయత్తం అవుతున్నారు. జీవన్ రెడ్డితో పాటుగా అనుచర వర్గం పార్టీని వీడాలని డిసైడ్ అయింది. కాగా.. జగిత్యాల పట్టణంలో రైతులు ఈరోజు(సోమవారం) పెద్దఎత్తున ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీకి జీవన్‌రెడ్డి నాయకత్వం వహించారు. వివిధ గ్రామాల నుంచి వచ్చిన మొక్కజొన్న రైతులు తమ సమస్యలను ప్రభుత్వానికి తెలపడానికి కలెక్టరేట్‌కు తరలివచ్చారు. రైతుల చేతుల్లో ప్లకార్డులు పట్టుకొని నినాదాలు చేస్తూ తమ ఆందోళన వ్యక్తం చేశారు. అన్నదాతల సమస్యలను పట్టించుకోవడంలో రేవంత్‌రెడ్డి ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోందని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మొక్కజొన్న పంట కొనుగోళ్లలో ప్రభుత్వం జాప్యం చేస్తోందని ఆగ్రహించారు. రైతుల పంటకు తగిన ధర దక్కకపోవడం వల్ల తీవ్రంగా నష్టపోతున్నారని తెలిపారు. మొక్కజొన్నను మద్దతు ధరకు వెంటనే కొనుగోలు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

కాంగ్రెస్ కు రాజీనామా ముందే నిరసనల బాట
ర్యాలీ అనంతరం కలెక్టర్ కార్యాలయానికి వెళ్లి అధికారులకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా జీవన్‌రెడ్డి మాట్లాడారు. మొక్కజొన్న పంటకు తగిన ధర ఇవ్వాలని, వెంటనే ప్రభుత్వం కొనుగోళ్లు ప్రారంభించాలని డిమాండ్ చేశారు. మొక్కజొన్న కొనుగోళ్ల విషయంలో ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్యం చూపుతోందని జీవన్‌రెడ్డి ధ్వజమెత్తారు. రైతులు పంట పండించి మార్కెట్‌కు తీసుకువస్తే ప్రభుత్వం సరైన విధంగా కొనుగోళ్లు చేయడం లేదని ఫైర్ అయ్యారు. కొనుగోళ్లు ఆలస్యం కావడంతో రైతులు మధ్యవర్తుల చేతిలో నష్టపోతున్నారని పేర్కొన్నారు. మార్కెట్లో ధరలు తగ్గిపోవడంతో రైతులు తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించి రైతుల నుంచి మొక్కజొన్నను మద్దతు ధరకు కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. దీంతో.. ఇక జీవన్ రెడ్డి ప్రభుత్వం పైన పోరాటానికి రాజీనామాకు ముందే సిద్దమైనట్లు స్పష్టం అవుతోంది. మాజీ సీఎం కేసీఆర్ సమక్షంలో జీవన్ రెడ్డి బీఆర్ఎస్ లో చేరేందుకు నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.












Click it and Unblock the Notifications