ఉప ఎన్నికలు ఖాయమా - ఏం జరుగుతోంది..!!
తెలంగాణలో ఉప ఎన్నికల పైన చర్చ మొదలైంది. కాంగ్రెస్ లో చేరిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేల అనర్హత పైన కొద్ది రోజుల క్రితం హైకోర్టు ఆదేశాలు ఇచ్చింది. స్పీకర్ వీటి పైన నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. ఇదే సమయంలో మూడు నియోజకవర్గాల్లో ఉప ఎన్నికలు ఖాయమనే ప్రచారం జరుగుతోంది. కాంగ్రెస్ అందుకు సిద్దమవుతున్నట్లుగా తెలుస్తోంది. ఇదే అంశం పై కడియం శ్రీహరి కీలక వ్యాఖ్యలు చేసారు.
కాంగ్రెస్ సిద్దమే
ఎమ్మెల్యే కడియం శ్రీహరి స్టేషన్‌ఘనపూర్‌కు ఉప ఎన్నికలు వచ్చినా కాంగ్రెస్ సిద్ధంగా ఉందని స్పష్టం చేశారు. పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించిందే బీఆర్ఎస్ అని అన్నారు. ఏకంగా శాసనసభ పక్షాలను కలుపుకున్న చరిత్ర బీఆర్ఎస్ కు ఉందని వ్యాఖ్యానించారు. ఇక వైపు..ఇప్పట్లో ఉప ఎన్నిక రావని చెబుతూనే... వచ్చినా ఎదుర్కోవడానికి కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా ఉందని స్పష్టం చేశారు. స్టేషన్ ఘనపూర్‌లో ఎన్నికలు వస్తే... బీఆర్ఎస్‌కు డిపాజిట్లు కూడా రావని జోస్యం చెప్పారు.

బీఆర్ఎస్ వర్సస్ కాంగ్రెస్
తమకు కోర్టులు.. ప్రజాస్వామ్యంపై గౌరవం ఉందన్నారు. వరంగల్ చరిత్రను కనుమరుగు చేసేందుకే ఉమ్మడి జిల్లాను కేసీఆర్ ఆరు ముక్కలు చేశారని ఆరోపించారు. ఇది అడిగినందుకే తనకు రెండోసారి మంత్రి పదవి ఇవ్వలేదని వెల్లడించారు. అటు బీఆర్ఎస్ నేతలు మాత్రం తెలంగాణలో ఉప ఎన్నికలు ఖాయమని ప్రచారం చేస్తున్నారు. స్టేషన్‌ఘనపూర్‌కు త్వరలో ఉపఎన్నిక వస్తుందని కేటీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఆ ఎన్నికల్లో తాటికొండ రాజయ్య విజయం సాధించడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు.
గెలుపు పై ధీమా
2023 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో స్టేషన్ ఘన్‌పూర్ నియోజకవర్గంలో బీఆర్‌ఎస్ విజయం సాధించింది. బీఆర్ఎస్ నుంచి కడియం శ్రీహరి పోటీచేసి విజయం సాధించారు. కానీ 2024 పార్లమెంట్ ఎన్నికల సమయానికి కడియం పార్టీకి గుడ్‌బై చెప్పేశారు. కడియం శ్రీహరికి బీఆర్‌ఎస్‌కు రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీలో చేరారు. కడియంతో పాటు పలువురు బీఆర్‌ఎస్‌కు చెందిన ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో చేరిన వారిపై అనర్హత వేటు వేయాలంటూ బీఆర్‌ఎస్ పార్టీ హైకోర్టులో పిటిషన్ వేయగా..కోర్టు కీలక ఆదేశాలు ఇచ్చింది. దీంతో, ఇప్పుడు ఉప ఎన్నికల పైన చర్చ ఆసక్తి కరంగా మారుతోంది.












Click it and Unblock the Notifications