ఖాకీల వడ్డీ దందా, ఎమ్మెల్యేకే రూ.3 కోట్ల రుణం!: ఏఎస్సై రిమాండ్, ఏఎస్పీపై బదిలీవేటు
కరీంనగర్: జిల్లా ఖాకీల వడ్డీ దందాలో అనేక ఆసక్తికర అంశాలు వెలుగు చూస్తున్నాయి. కరీంనగర్‌లో ఏఎస్సైగా పనిచేస్తున్న మోహన్ రెడ్డి వడ్డీ వ్యాపారాన్ని జోరుగా సాగిస్తున్నారు. కోట్లాది రూపాయల మేర అప్పులిస్తున్న ఆయన ఆయా రుణ గ్రహీతలకు చెందిన ఆస్తులను బలవంతంగా రాయించుకుంటూ, వేధింపులకు గురిచేస్తున్నాడు.
కాగా, మోహన్ రెడ్డి వడ్డీ వ్యాపారంలో పెట్టుబడులు పెట్టిన కరీంనగర్ జిల్లా అదనపు ఎస్పీ జనార్దన్ రెడ్డిపై గురువారం బదిలీ వేటు పడింది. తెలంగాణలో సంచలనం రేకెత్తిస్తున్న ఈ కేసులో సిఐడి పోలీసులు కొత్త కోణాలను వెలికితీస్తున్నారు. దీంతో మరికొందరి పేర్లు కూడా బయటపడే అవకాశం ఉంది.
మోహన్ రెడ్డి వద్ద జిల్లాకు చెందిన ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి ఏకంగా రూ.3 కోట్ల మేర రుణం తీసుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇప్పటికే అరెస్టైన మోహన్ రెడ్డి తనకు బెయిల్ ఇవ్వాలని కరీంనగర్ జిల్లా కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.

దీనిపై విచారణ చేపట్టిన జిల్లా కోర్టు ఆయనకు బెయిల్‌ను నిరాకరించింది. బెయిల్ పై విచారణ జరుగుతున్న సందర్భంగా మోహన్ రెడ్డికి బెయిల్ ఇవ్వవద్దని సీఐడీ అధికారులు కోర్టును అభ్యర్థించారు.
ఏఎస్‌ఐ మోహన్‌రెడ్డికి 27వరకు రిమాండ్ పొడిగింపు
కాగా, ప్రధాన నిందితుడు మోహన్‌రెడ్డి విచారణలో పోలీసు ఉన్నతాధికారులు, రాజకీయ నాయకుల పేర్లు వెలుగులోకి వస్తుండటంతో ఈ వ్యవహారం సంచలనంగా మారుతోంది. ఈ కేసుతో సంబంధమున్న అదనపు ఎస్పీ జనార్ధన్‌రెడ్డిపై ఉన్నతాధికారులు ఇప్పటికే వేటు వేశారు.
మరికొందరు అధికారులపై వేటు వేసేందుకు పోలీసు శాఖ సిద్ధమవుతోంది. ఏఎస్‌ఐ మోహన్‌రెడ్డి బెయిల్ పిటిషన్‌పై విచారణను కరీంనగర్ కోర్టు సోమవారానికి వాయిదా వేసింది. ఆయన రిమాండ్‌ను ఈనెల 27 వరకు పొడిగిస్తూ ఉత్తర్వులు జారీచేసింది.












Click it and Unblock the Notifications