కౌశిక్ రెడ్డి ఎమ్మెల్సీ డైలమా-తేల్చేసిన గవర్నర్ : ప్రభుత్వ నిర్ణయం పైనా-ఏం జరగనుంది..!!
హుజూరాబాద్ యూత్ లీడర్ కౌశిక్ రెడ్డిని ఎమ్మెల్సీ చేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయించారు. టీఆర్ఎస్ లో చేరిన కొద్ది రోజులకే కేబినెట సమావేశంలో ఈ మేరకు తీర్మానం చేసారు. ఆగస్టు ఒకటవ తేదీన జరిగిన తెలంగాణ మంత్రివర్గ సమావేశంలో గవర్నర్ నామినేటెడ్ కోటాలో కౌశిక్ రెడ్డిని ఎమ్మెల్సీగా సిఫార్సు చేస్తూ కేబినెట్ నిర్ణయించింది. కానీ, 40 రోజులు కావస్తున్నా ఆయన అధికారికంగా ఎమ్మెల్సీ గా నియిమిస్తూ నోటిఫికేషన్ రాలేదు. హుజూరాబాద్ లో ఉప ఎన్నిక వేళ..కేసీఆర్ వ్యూహాత్మకంగా వేస్తున్న అడుగుల్లో భాగంగా కౌశిక్ రెడ్డికి ఎమ్మెల్సీ పదవి కేటాయించారు.

కేసీఆర్ నిర్ణయించినా..ఇంకా అమలు కాకుండా
హుజూరాబాద్‌లో రాజకీయ పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని కౌశిక్‌రెడ్డిని హడావుడిగా గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీగా నామినేట్ చేస్తూ తీర్మానించారు. సాహిత్యం, సైన్స్, కళలు, సహకార ఉద్యమం, సామాజిక సేవ తదితర రంగాల్లో అనుభవమున్న వారిని గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీగా నామినేట్ చేసే అధికారం రాష్ట్ర మంత్రిమండలికి ఉంటుంది. రాజేందర్ ను దెబ్బ తీసేందుకు కౌశిక్ రెడ్డికి ఎమ్మెల్సీ ఇవ్వాలని నిర్ణయించారు. దీని పైన కౌశిక్ రెడ్డితో పాటుగా ఆయన సన్నిహితులు - అనుచరులు పైకి ధీమాగా ఉన్నా..ఎందుకు నోటఫికేషన్ జారీ కాలేదనే అంశం పైన ఆందోళనలో ఉన్నారు.

గవర్నర్ తేల్చి చెప్పేసారు..
సహజంగా కేబినెట్ సిఫార్సు చేసిన తరువాత గవర్నర్ వద్ద ఎక్కువ రోజులు ఇటువంటి ఫైల్స్ పెండింగ్ లో ఉండవు. కానీ, కౌశిక్ రెడ్డి నియామకానికి సంబంధించి మాత్రం నిర్ణయం వెలువడలేదు. ఇదే విషయం పైన టీఆర్ఎస్ నుంచి ఎటువంటి అధికారిక సమాచారం లేదు. ఇదే సమయంలో తెలంగాణ గవర్నర్ గా రెండేళ్లు పూర్తి చేసుకున్న తమిళసై మీడియా ప్రతినిధులతో సమావేశమయ్యారు. ఆ సమయంలో కౌశిక్ రెడ్డి ఫైల్ గురించి కీలక అంశం బయట పెట్టారు. కౌశిక్ రెడ్డి ఎమ్మెల్సీ గా నియామక ఫైల్ తన వద్దే ఉందని...తనకు నిర్ణయం తీసుకోవటానికి మరి కొంత సమయం కావాలని వ్యాఖ్యానించారు.

కౌశిక్ పైన ఉన్న కేసులే అడ్డుగా ఉన్నాయా..
అయితే, దీనికి సంబంధించి కొద్ది రోజులుగా పొలిటికల్ సర్కిల్స్ లో ప్రచారం జరుగుతోంది. కౌశిక్ పైన ఉన్న కేసుల కారణంగానే ఆయన నియమకానికి ఇంకా అనుమతి రాలేదనే వాదన వినిపిస్తోంది. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో హుజూరాబాద్ కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసిన పాడి కౌశిక్‌రెడ్డిపై ఇల్లంతకుంట, సుబేదారి పోలీస్‌స్టేషన్లలో కేసులు పెట్టారు. ఆ తర్వాత కూడా వీణవంక, హుజూరాబాద్ టౌన్, కరీంనగర్, జమ్మికుంట, సిరిసిల్ల తదితర పోలీస్‌స్టేషన్ల పరిధిలో వివిధ ఐపీసీ సెక్షన్ల కింద కేసులు నమోదయ్యాయి.

సేవారంగంలో ఉన్నారంటూ కేబినెట్ సిఫార్సు
అదే విధంగా..రాజేందర్ ను దెబ్బ కొట్టేందుకు.. వాహనం పార్కింగ్ విషయంలో తమ బంధువుపై కౌశిక్‌రెడ్డి దాడి చేశారని 2019 ఫిబ్రవరిలో సినీనటులు జీవిత, రాజశేఖర్ జూబ్లీహిల్స్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసారు. ఇదే సమయంలో కౌశిక్ రెడ్డి సేవా రంగంలోనూ ఉన్నారు. క్రీడల పరంగానూ రాణించారు. దేశవాళీ క్రికెట్‌లో రాణించిన కౌశిక్‌రెడ్డి.. తన తల్లి పేరిట కరీంనగర్ జిల్లాలో పుష్పమాల దేవి మెమోరియల్ ట్రస్టు పెట్టి 2009 నుంచి సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. ఈ మేరకు క్రీడా, సేవా రంగాల్లో చేసిన కృషి మేరకు ఎమ్మెల్సీగా నామినేట్ చేస్తున్నట్టు కేబినెట్ తీర్మానంలో పేర్కొంది.

గతంలో కేసుల వ్యవహారంతో..డైలమా
అయితే కౌశిక్‌రెడ్డికి పదవి ఇవ్వడంపై హుజూరాబాద్ టీఆర్‌ఎస్ శ్రేణులతోపాటు రాష్ట్ర నాయకుల్లోనూ అంతర్గతంగా అసంతృప్తి వ్యక్తమైనట్టు తెలిసింది. కౌశిక్‌రెడ్డిపై నమోదైన కేసుల విషయంగా గవర్నర్క్ కు ఫిర్యాదులు అందాయని..దానితో నివేదిక కోరారని చెబుతున్నారు. గతంలో తెలంగాణ ప్రభుత్వం గవర్నర్ కోటాలో గోరటి వెంకన్న, బస్వరాజు సారయ్య, దయానంద్‌లను నామినేట్ చేయడంపై ధన్‌గోపాల్‌రావు అనే వ్యక్తి కోర్టును ఆశ్రయించారు. ఈ నేపథ్యంలో కౌశిక్‌రెడ్డి విషయంగా ఆచితూచి అడుగులు వేయాలని గవర్నర్ భావిస్తున్నట్లుగా కనిపిస్తోంది.

నివేదిక-న్యాయ సలహా తరువాతనే నిర్ణయం..
కౌశిక్‌రెడ్డి కాంగ్రెస్‌ను వీడుతూ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. రేవంత్‌రెడ్డి పీసీసీ చీఫ్ పదవి కోసం కాంగ్రెస్ తెలంగాణ వ్యవహారాల ఇన్‌చార్జి మాణిక్యం ఠాగూర్‌కు లంచం ఇచ్చారని కౌశిక్‌రెడ్డి ఆరోపించారు. దీనిపై మాణిక్యం ఠాగూర్ పరువు నష్టం దావా వేశారు. దీంతో..కౌశిక్ రెడ్డి పైన ఉన్న కేసులు..వాటి తీవ్రత..ప్రస్తుత పరిస్థితి పైన పూర్తి సమాచారం..వాటి పైన న్యాయ సలహా తీసుకున్న తరువాత గవర్నర్ కౌశిక్ రెడ్డిని నామినేటెడ్ కోటాలో ఎమ్మెల్సీగా ఆమోదించే అవకాశం ఉన్నట్లు విశ్వసనీయ సమాచారం.

రాజేందర్ ను దెబ్బ తీసేందుకే..
ఇక, ఇప్పటికే కౌశిక్ రెడ్డి హుజూరాబాద్ లో టీఆర్ఎస్ అభ్యర్ధి శ్రీనివాస్ తరపున ప్రచారం చేస్తున్నారు. తొలుత టీఆర్ఎస్ నుంచి తానే అభ్యర్దిని అవుతానంటూ కౌశిక్ ఆ నియోజకవర్గ నేతలతో మాట్లాడిన ఆడియో లీక్ అయింది. అదే రోజు ఆయన కాంగ్రెస్ కు రాజీనామా చేసారు. కాంగ్రెస్ ను వీడే సమయంలో టీపీసీసీ చీఫ్ రేవంత్ పైన తీవ్ర వ్యాఖ్యలు చేసారు. దీంతో..వెంటనే కాంగ్రెస నుంచి కౌశిక్ ను సస్పెండ్ చేసారు. అప్పిటికే ఒక ప్రయివేటు కార్యక్రమంలో మంత్రి కేటీఆర్ ను కలిసిన కౌశిక్..ఆ తరువాత అధికారికంగా టీఆర్ఎస్ లో చేరారు.

ఉప ఎన్నిక షెడ్యూల్ లోగా క్లియర్ అవుతుందా..
హుజూరాబాద్ లో సీఎం కేసీఆర్ పలువురికి పదవుల పందేరం చేసారు. అందులో భాగంగా.. టిక్కెట్ ఆశించి దక్కకుండా పోయిన కౌశిక్ రెడ్డిని ఎమ్మెల్సీగా చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఇప్పుడు ఆ ఫైల్ గవర్నర్ దగ్గర ఉండటంతో...చివరగా గవర్నర్ దీని పై ఎటువంటి నిర్ణయం తీసుకుంటారనే ఉత్కంఠ గులాబీ నేతల్లో కనిపిస్తోంది. గవర్నర్ మాత్రం పూర్తి సమాచారం వచ్చిన తరువాతనే నిర్ణయం తీసుకోవాలని భావిస్తున్నట్లుగా స్పష్టం అవుతోంది.












Click it and Unblock the Notifications