కవితను కలిసిన తల్లి శోభ; కూతురు కోసం రంగంలోకి కేసీఆర్?
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఢిల్లీ లిక్కర్ కుంభకోణంలో అరెస్టై ప్రస్తుతం ఈడీ విచారణను ఎదుర్కొంటున్నారు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత. గత ఆరు రోజులుగా ఎమ్మెల్సీ కవిత ఈడి కస్టడీలో ఉన్నారు. ప్రస్తుతం ఆమెను ఈడి అధికారులు విచారణ జరుపుతున్నారు. ఎమ్మెల్సీ కవితతో పాటు ఆమె పిఏ, ఆమె వద్ద పనిచేస్తున్న సిబ్బందిని ఈడీ అధికారులు విచారిస్తున్నారు.
అయితే తన తల్లిని, తన పిల్లలను చూడాలని కవిత రౌస్ అవెన్యూ కోర్టుకు విజ్ఞప్తి చేయడంతో కోర్టు కుటుంబ సభ్యులను కలవడానికి అనుమతినిచ్చింది. ఈ క్రమంలో నిన్న కోర్టు అనుమతుల ప్రకారం 7 గంటల నుండి ఎనిమిది గంటల వరకు కల్వకుంట్ల కవితను ఆమె తల్లి శోభ కలిశారు.

తల్లి శోభతో పాటు సోదరుడు కేటీఆర్, రాజ్యసభ సభ్యుడు సంతోష్ కుమార్, సోదరి సౌమ్య కూడా కవితను కలిసి ఆమె క్షేమ సమాచారాలు అడిగి తెలుసుకున్నారు. సుమారు గంటసేపు కవితతో మాట్లాడిన తల్లి శోభ ఆందోళన చెందవద్దని, ఆరోగ్యం జాగ్రత్త గా చూసుకోవాలని సూచించినట్లు సమాచారం. కవిత తల్లితో తన పిల్లల క్షేమ సమాచారాన్ని తెలుసుకున్నారని సమాచారం.
ఇదిలా ఉంటే కవిత అరెస్టుతో కేసీఆర్ తన మనసు మార్చుకుని, కేంద్రంపై యుద్ధం ప్రకటించడానికి పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేయాలనే నిర్ణయం తీసుకున్నారని చర్చ జరుగుతుంది. ఈ విషయంపై తర్జనభర్జనలు జరుగుతున్నట్టు, మెదక్ లోక్సభ స్థానం నుంచి స్వయంగా అధినేత కెసిఆర్ బరిలోకి దిగే అవకాశాలు లేకపోలేదని, ఈ క్రమంలోనే అక్కడ అభ్యర్థి ప్రకటన రాలేదన్న చర్చ కూడా జరుగుతుంది.
కవిత కేసు వ్యవహారంలో జాగ్రత్తగా అడుగు వేయాలని భావిస్తున్న తండ్రి కెసిఆర్, కేంద్రాన్ని ఇరకాటంలో పెట్టడానికి, కేంద్రంలో అధికార ప్రభుత్వం పై బలంగా పోరాటం చేయడానికి ఏం చేయాలన్న దానిపై సీరియస్ గానే దృష్టి పెట్టినట్టు తెలుస్తుంది. ఒకవైపు పార్లమెంట్ ఎన్నికలు ముంచుకొస్తున్న తరుణంలో, కెసిఆర్ ని ఇరకాటంలో పెట్టిన కవిత ఢిల్లీ లిక్కర్ కేసు కెసిఆర్ తో ఏ వైపు అడుగులు వేయిస్తుంది అన్నది అన్ని రాజకీయ వర్గాలు ఆసక్తిగా చూస్తున్నాయి.












Click it and Unblock the Notifications