ఎక్సలెన్స్ అవార్డు సాధించిన మనవడిపై కేసీఆర్ ప్రేమ.. ఉబ్బి తబ్బిబ్బైన కేటీఆర్
తెలంగాణ సీఎం కేసీఆర్ మనవడు, మంత్రి కేటీఆర్ కుమారుడు, తండ్రిలానే ఎప్పుడు సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ కమ్యూనిటీ యాక్టివిటీస్ లో ఉత్సాహంగా పాల్గొనే హిమాన్షు గ్రాడ్యుయేషన్ డే లో తెలంగాణ సీఎం కేసీఆర్ పాల్గొన్నారు. సకుటుంబ సపరివార సమేతంగా ఈ కార్యక్రమానికి హాజరైన కేసీఆర్ దంపతులు మనవడు హిమాన్షు సాధించిన విజయాలను చూసి సంబరపడ్డారు. మంత్రి కేటీఆర్ కొడుకు ఎక్సలెన్స్ అవార్డు సాధించడంతో ఉబ్బితబ్బిబ్బయ్యారు.
మంత్రి కేటీఆర్ కుమారుడు హిమాన్షు గచ్చిబౌలిలోని ఓక్రిడ్జ్ ఇంటర్నేషనల్ స్కూల్ లో 12వ తరగతి పూర్తి చేసి పట్టా తీసుకున్నాడు. చదువుతో పాటు సామాజిక అంశాలపై అవగాహన, మ్యూజిక్ లో పరిజ్ఞానం ఉన్న హిమాన్షు ఇప్పటికే అనేక సార్లు అనేక విషయాలలో వార్తల్లో నిలిచారు. తండ్రికి తగ్గ తనయుడు అనిపించుకున్నారు. అలాంటి హిమాన్షు కోసం తాత కేసీఆర్ ఈ రోజు హిమాన్షు చదివే స్కూల్ కు వెళ్ళారు.

ఈ గ్రాడ్యుయేషన్ డే వేడుకలో సీఎం కేసీఆర్ ఆయన సతీమణి శోభ ప్రధాన ఆకర్షణగా నిలిచారు. తల్లిదండ్రులు కేటీఆర్, శైలిమ, హిమాన్షు సోదరి కూడా హాజరయ్యారు. అంతేకాదు శైలమ తల్లి, ఆమె బంధువులు సైతం ఈ గ్రాడ్యుయేషన్ డే వేడుకకు హాజరయ్యారు. 12వతరగతి పూర్తిచేసి పట్టా తీసుకున్న క్షణాలను అందరూ తిలకించారు. పట్టా తీసుకోవడంతో పాటు కమ్యూనిటీ యాక్టివిటీ సర్వీసెస్ విభాగంలో ఉత్తమ ప్రతిభను ప్రదర్శించినందుకు ఎక్సలెన్స్ అవార్డును అందించారు.

కొడుకు ఎక్సలెన్స్ అవార్డు అందుకోవడంతో తండ్రి కేటీఆర్ సంతోషం వ్యక్తం చేశారు. ఆపై హిమాన్షు తాను అందుకున్న పట్టాను తీసుకుని తాత కెసిఆర్ వద్దకు వెళ్ళి, ఆయన చేతుల్లో పెట్టి పాదాలకు నమస్కరించి ఆశీర్వాదం తీసుకున్నారు. దీంతో కేసీఆర్ ఉన్నత చదువులు చదివి, జీవితంలో మరింత గొప్పగా ఎదగాలని, సమాజానికి గొప్ప సేవ చేయాలని మనవడు హిమాన్షును ఆశీర్వదించారు. కేటీఆర్ దంపతులు కూడా కుమారుడు హిమాన్షు సాధించిన పట్టాను, ఎక్సలెన్స్ అవార్డు చూసి మురిసిపోయారు.












Click it and Unblock the Notifications