కేసీఆర్ నుంచి ఫోన్! క్లారిటీ ఇచ్చిన ఈటల రాజేందర్
తనకు మాజీ సీఎం, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఫోన్ చేసినట్లు జరుగుతున్న ప్రచారంపై మాజీ మంత్రి, మల్కాజిగిరి బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ స్పందించారు. కేసీఆర్ తనకు ఫోన్ చేసి మళ్లీ కలిసి పనిచేయాలని పిలిచారన్న వార్తలు పూర్తిగా నిరాధారమైనవని తేల్చి చెప్పారు. ఇలాంటి అసత్య ప్రచారాలను నమ్మవద్దన్నారు.
నేనంటే గిట్టనవారు, సోషల్ మీడియాలో ఉండే సైకోలు, శాడిస్టులు మాత్రమే ఇలాంటి ప్రచారం చేస్తున్నారు. ఇందులో ఎలాంటి నిజం లేదు అని ఈటల రాజేందర్ స్పష్టం చేశారు. తాను చాలా కాలంగా బీఆర్ఎస్, కేసీఆర్ విషయంలో తన స్పష్టమైన అభిప్రాయాన్ని చెబుతూనే ఉన్నానన్నారు.

అయినప్పటికీ కొందరు కావాలనే తనపై దుష్ప్రచారం చేస్తున్నారని ఈటల రాజేందర్ మండిపడ్డారు. ఇది పూర్తిగా బాధ్యత లేని వ్యక్తుల శాడిజం, నాపై ఇలాంటి తప్పుడు ప్రచారాలు చేసేవారిపై త్వరలోనే చట్టపరమైన చర్యలు తీసుకుంటా అని ఈటల రాజేందర్ హెచ్చరించారు. ఇటీవల ఓ ఇంటర్వ్యూలోనూ ఈటల రాజేందర్ తన వైఖరిని తేల్చేశారు.
మళ్లీ కేసీఆర్ పిలిస్తే వెళ్తారా? అనే ప్రశ్నకు ఆయన సీరియస్ అయ్యారు. ఇదేమైనా పిల్లల ఆటనా? మేమంతా బాధ్యత ఉన్న పొలిటికల్ లీడర్లమని అన్నారు. వాళ్ల పార్టీ వాళ్లది, మా పార్టీ మాది. రేపు నేను బీఆర్ఎస్‌ను ఓడించి తెలంగాణలో బీజేపీని గెలిపించడం నా లక్ష్యం అని ఈటల రాజేందర్ స్పష్టం చేశారు. మరోవైపు, నాటి బీఆర్ఎస్, నేటి కాంగ్రెస్ ప్రభుత్వాలపై ఆయన విమర్శలు గుప్పించారు.
గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఒక్క రోజులో నిర్వహించిన సమగ్ర కుటుంబ సర్వేలో సరైన సమాచారం లేదని.. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన కులగణనలోనూ శాస్త్రీయత లేనేలేదని విమర్శలు గుప్పించారు ఈటల రాజేందర్. వైయస్సార్ ముఖ్యమంత్రిగా ఉన్నపుడే బీసీ-ఈ గ్రూపు తీసుకొచ్చారన్నది తప్పు వాదని అని.. నిజానికి అంతకుముందే కొన్ని ముస్లిం కులాలు బీసీ-బీ గ్రూప్‌లో ఉన్నాయని ఈటల రాజేందర్ తెలిపారు.
కాంగ్రెస్ సర్కారుకు నిష్పక్షపాత దృష్టి, చిత్తశుద్ధి, సరైన ప్రణాళిక ఏమీలేదని విమర్శించారు. ఒక కమిషన్ ఏర్పాటు చేసి, దానికి చట్టబద్ధత కల్పించి, రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న కులాలను గుర్తించాకే జనగణన చేయాలన్నారు. ఇలాంటివేమీ చేయకుండా కులగణన పేరిట కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలను తప్పుదోవ పట్టిస్తోందని మండిపడ్డారు. అవగాహన లేనివారు డైవర్ట్ పాలిటిక్స్ చేస్తున్నారని, ఇది ప్రజలకు మేలు చేసే విషయం కాదన్నారు.












Click it and Unblock the Notifications