అమెరికా తరహాలో కెసిఆర్ ‘ఈ’ సభలు: ఒకేసారి 10కిపైగా ప్రాంతాల ప్రజలతో ముఖాముఖి
హైదరాబాద్: హైదరాబాద్ మహానగరపాలక సంస్థ (జీహెచ్‌ఎంసీ) ఎన్నికల నేపథ్యంలో ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు వినూత్న రీతిలో ప్రచారం నిర్వహించనున్నారు. అమెరికా తరహాలో ఈ(ఎలక్ట్రానిక్) సభలను నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ముఖ్యమంత్రి సరికొత్త రీతిలో చేపట్టే ప్రచారం నగరంలోని ప్రతి గడపగడపకూ చేరాలని టిఆర్ఎస్ భావిస్తోంది.
ఈ-సభల ద్వారా కేసీఆర్ ఇచ్చే సందేశాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లటంతో పాటు ప్రజల ప్రశ్నలకు ముఖ్యమంత్రి నేరుగా సమాధానాలిచ్చేలా ఏర్పాట్లు చేయనున్నారు. సాధారణంగా బహిరంగ సభల ద్వారా, డివిజన్ల వారీగా వీధుల్లో తిరిగి ఎన్నికల్లో ప్రచారం చేయడం సాధారణమే.
కానీ, సీఎం కేసీఆర్ రోడ్ షోలు, బహిరంగ సభలు నిర్వహిస్తే ప్రజలు ఇబ్బందులు పడుతారని టీఆర్‌ఎస్ నేతలు భావించి ‘ఈ' సభలను నిర్వహించేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నారు.
కాగా, గత లోక్‌సభ ఎన్నికల్లో నరేంద్ర మోడీ ఎలక్ట్రానిక్ సభల ద్వారా ప్రచారాన్ని నిర్వహించారు. మోడీ ఒక చోట మాట్లాడుతుంటే అదే సమయంలో మరికొన్ని ప్రాంతాల్లో ప్రత్యేక తెరలపై ఈ ప్రసంగం వినే ఏర్పాటు చేశారు. అయితేు, దీనికి కాస్త భిన్నంగా ఇ-సభలను నిర్వహించాలని టిఆర్ఎస్ అనుకుంటోంది.

కేసీఆర్ ఒక టీవీ ఛానల్‌లో లేదా ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన వేదికపైగానీ కూర్చుంటారు. అక్కడి నుంచి నగరంలోని పది పన్నెండు కేంద్రాలకు ప్రత్యక్ష ప్రసారానికి ఏర్పాట్లు చేస్తారు. ఈ కేంద్రాల నుంచి నగర ప్రజలు ముఖ్యమంత్రిని వివిధ ప్రశ్నలు అడిగితే ఆయన దీనిపై సమాధానాలు ఇస్తారు.
అలాగే నగరానికి తాను ఈ 18 నెలల కాలంలో ఏమి చేసింది.. రాబోయే రోజుల్లో ఏమి చేయబోతోంది.. .తమ ప్రణాళికలనూ ఆయన వివరిస్తారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఇలాంటి సభలను కనీసంగా ఐదారు నిర్వహించాలని టిఆర్ఎస్ వర్గాలు భావిస్తున్నాయి. టీవీల ప్రత్యక్ష ప్రసారాల ద్వారా నగరంలోని ప్రతి గడపకు ముఖ్యమంత్రి ప్రసంగం చేరుతుందని అంటున్నారు.
ఈ-సభలను ఎలా నిర్వహించాలన్న దానిపై సంక్రాంతి పండుగ తరువాత నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని సమాచారం. ఈ రూపంలో కాకుండా డివిజన్ల వారీగా ప్రచారం చేస్తే ట్రాఫిక్, ఇతరత్రా సమస్యలు ఎదురై ప్రజలకు అసౌకర్యం కలిగే అవకాశం ఉందని ముఖ్యమంత్రి భావిస్తున్నారని తెలిసింది. ఈ-సభలకు మధ్యలో, చివరన రెండు మూడు భారీ బహిరంగ సభలను నిర్వహించడానికి కూడా టిఆర్ఎస్ ఏర్పాట్లు చేస్తోంది.
అంతేగాక, ఈ సభలను స్మార్ట్ ఫోన్, ఐపాడ్ ద్వారానో ప్రత్యక్ష ప్రసారాలను టీఆర్‌ఎస్ నేతలు అందుబాటులోకి తేవడానికి యత్నిస్తున్నట్లు సమాచారం. కాగా, ఫిబ్రవరి 2న జీహెచ్‌ఎంసీ ఎన్నికలకు పోలింగ్ జరగనుంది. 5న ఓట్ల లెక్కింపు జరగనుంది. నామినేషన్ల స్వీకరణ జనవరి 17న మధ్యాహ్నం 3 గంటలకు ముగియనుంది.












Click it and Unblock the Notifications