'జిల్లాలో అదో చెల్లని రూపాయి': కెసిఆర్
నిజామాబాద్: కాంగ్రెస్ నేత, ఎమ్మెల్సీ షబ్బీర్ అలీపై తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. గురువారం ఆయన సదాశివనగర్ గ్రామంలో చెరువుల పునరుద్దరణ కోసం ప్రభుత్వం చేపట్టిన మిషన్ కాకతీయను పథకాన్ని ప్రారంభించారు. అనంతరం ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మాట్లాడారు.
తమ ప్రభుత్వం చేస్తోన్న అభివృద్ధి పనులను ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ నేతలు అనవసరంగా విమర్శిస్తున్నారని మండిపడ్డారు. జిల్లాలో ఒక చెల్లని రూపాయి ఉందని అది షబ్బీర్ ఆలీ అని ఎద్దేవా చేశారు. ఆ చెల్లని రూపాయి కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ వద్ద చెల్లిందని స్పష్టం చేశారు.

ఏదో పాపమని ఆమె ఆయనకు ఒక ఎమ్మెల్సీ సీటు ఇచ్చిందని పేర్కొన్నారు. వంద హామీలిచ్చి ఒక్క హామీ కూడా నెరవేర్చలేదని షబ్బీర్ ఆలీ అనడంపై సీఎం మండిపడ్డారు. తమ ప్రభుత్వం అమలు చేసిన అభివృద్ధి పథకాలు షబ్బీర్ ఆలీకి కనపడటం లేదా అని ప్రశ్నించారు.
వృద్ధులకు, వికలాంగులకు, వితంతువులకు రూ.200 నుంచి రూ.1000, రూ.1500 వరకు పెన్షన్లు పెంచింది, కళ్యాణ లక్ష్మి పథకం కింద పేద దళిత మహిళలకు రూ.51 వేలు ఇస్తున్నది కనిపించడం లేదా అని ప్రశ్నించారు. ప్రభుత్వంపై విమర్శలు చేయడం మానుకని, నిర్మాణాత్మకమైన సూచనలు చేయాలని సిఎం కెసిఆర్ సూచించారు.
దోచుకునేందుకే మిషన్ కాకతీయ
తెలంగాణ బడ్జెట్ అంతా అంకెల గారడీ, తప్పుడు లెక్కలు తప్ప ఇంకేమీ లేదని మాజీమంత్రి, కాంగ్రెస్ ఎమ్మెల్సీ షబ్బీర్ అలీ అన్నారు. రైతుల ఆత్మహత్యలను ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు. ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలను కనీసం పరామర్శించలేదని అన్నారు. మంత్రులు, టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు, కార్యకర్తలు దోచుకోవడానికే మిషన్ కాకతీయ పథకం ప్రారంభించారని ఆరోపించారు.












Click it and Unblock the Notifications