అందులో నాకు గురువు కేసీఆర్ యే.. బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు
బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఏ చిన్న అవకాశం దొరికినా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ను టార్గెట్ చేస్తూనే ఉన్నారు. ఇక తాజాగా బీఆర్ఎస్ పార్టీ నేతలు తనను బూతులు మాట్లాడుతున్నారని చేస్తున్న వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చిన బండి సంజయ్ నేను బూతులు మాట్లాడుతున్నానా? అయితే నాకు గురువు సీఎం కేసీఆర్ యే అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.
సీఎం కేసీఆర్ గోబెల్స్ ను మించిన వ్యక్తి అని పేర్కొన్న బండి సంజయ్ అబద్ధాలకు కేరాఫ్ అడ్రస్ కేసీఆర్ అంటూ విమర్శలు గుప్పించారు. హరీష్ రావు ని టార్గెట్ చేసిన బండి సంజయ్ హరీష్ నీకు అగ్గిపెట్టె ఎందుకు దొరకలేదో చెప్పు అంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. మిషన్ భగీరథ పేరుతో ఇంటింటికి నీళ్లు ఇస్తామని చెప్పారని, కానీ ఇప్పటివరకు ఇంటింటికి నీళ్లు ఇచ్చిందే లేదని బండి సంజయ్ మండిపడ్డారు.

మిషన్ భగీరథ కోసం 40 వేల కోట్లు ఖర్చు పెట్టారని, కానీ నీళ్లు ఇవ్వడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. కెసిఆర్ ఇంటింటికి నీళ్ళు ఇవ్వకపోతే ఓట్లు అడగనని చెప్పారని, ఇప్పుడు ఏ మొహం పెట్టుకుని వెళ్లి ఓట్లు అడుగుతారు అంటూ ప్రశ్నించారు. స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి పై మండిపడిన బండి సంజయ్ రాజ్యాంగ పదవిలో ఉంటూ బాన్సువాడలో రాజ్యాంగానికి తూట్లు పొడుస్తున్నారని విమర్శించారు.
బాన్సువాడలో కుటుంబ పాలన సాగుతోందని, స్టేషనరీ స్కాంలో అడ్డంగా బుక్ అయిన వ్యక్తికి రాజ్యాంగబద్ధ పదవి ఇస్తే ఇలాగే ఉంటుందని బండి సంజయ్ స్పీకర్స్ పోచారం శ్రీనివాస్ రెడ్డిని టార్గెట్ చేశారు. జల జీవన్ మిషన్ కింద అన్ని రాష్ట్రాలలోని ఇంటింటికీ కేంద్రం నీళ్లు ఇచ్చిందని బండి సంజయ్ పేర్కొన్నారు. అంతేకాదు కేంద్ర ప్రభుత్వం నిరుద్యోగులకు ఉద్యోగాలు కూడా ఇస్తుందని, 10 లక్షల ఉద్యోగాలు ఇవ్వడాన్ని టార్గెట్ గా పెట్టుకుందన్నారు.

టిఎస్పిఎస్సి ప్రశ్నపత్రం లీకేజీ పై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని బండి సంజయ్ డిమాండ్ చేశారు. ప్రశ్నాపత్రం లీకేజీ విషయంలో మంత్రి కేటీఆర్ ను బర్తరఫ్ చేయాలని, పరిహారం చెల్లించాలని, అప్పటివరకు నిరుద్యోగుల కోసం పోరాడి తీరుతాం అన్నారు. ఈనెల 23వ తేదీన పార్లమెంటు ప్రవాస్ యోజనలో భాగంగా చేవెళ్ల కు అమిత్ షా రాబోతున్నారని పేర్కొన్న బండి సంజయ్ సాయంత్రం ఐదు గంటలకు జరిగే బహిరంగ సభలో అమిత్ షా పాల్గొంటారని బండి సంజయ్ పేర్కొన్నారు.












Click it and Unblock the Notifications