బీఆర్ఎస్‌పై ఆ రెండు పార్టీల కుట్రలు: కేసీఆర్
కాంగ్రెస్, బీజేపీలపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్. తెలంగాణ రాష్ట్రంలో జాతీయ పార్టీలు రెండు ఏకమై ప్రాంతీయ పార్టీను దెబ్బతీయాలని చూస్తున్నాయని కేసీఆర్ ఆరోపించారు.బస్సు యాత్రలో భాగంగా మూడరోజైన శుక్రవారం మహబూబ్‌నగర్ జడ్చర్ల, అప్పనపల్లి, ఏనుగొండ మీదుగా గడియారం కూడలికి చేరుకున్నారు కేసీఆర్. అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన కార్నర్ మీటింగ్‌లో ప్రసంగించారు.
తమ ప్రాబల్యాన్ని పెంచుకునేందుకు పోటీ పడుతున్నాయని కాంగ్రెస్, బీజేపీలపై కేసీఆర్ వ్యాఖ్యానించారు. ఒక పార్టీ దేవుడు పేరు చెప్పుకుని ఓట్లు అడుగుతుందని, మరో పార్టీ దేవుడిపై ఒట్లు పెట్టుకుని ప్రచారం చేస్తుందని విమర్శించారు. పాలమూరు ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇవ్వాలని ప్రధాని మోడీని పలుమార్లు బతిమాలిన పట్టించుకోలేదన్నారు. అలాంటి బీజేపీకు ఎందుకు ఓటు వేయాలని ప్రశ్నించారు.

కేంద్ర ప్రభుత్వం నల్ల చట్టాలను తెచ్చి అన్నదాతలను ఇబ్బందులు పెట్టిందని విమర్శించారు. రాష్ట్రానికి ఒక్క నవోదయ పాఠశాల కూడా కేటాయించలేదని మండిపడ్డారు. మోటర్లకు మీటర్లు పెట్టాలని మోడీ చెప్పినా.. తాను అంగీకరించలేదన్నారు కేసీఆర్. కేంద్రం తనపై ఒత్తిడి తెచ్చినా భయపడలేదన్నారు. కవితను అక్రమంగా అరెస్ట్ చేశారని మండిపడ్డారు.
మరోవైపు, అబద్ధపు హామీలిచ్చి కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిందని కేసీఆర్ విమర్శించారు. అధికారంలోకి వచ్చిన తర్వాత రైతులకు, ప్రజలకు ఇచ్చిన హామీలను మర్చిపోయిందని మండిపడ్డారు. ప్రజలకు ఇచ్చిన అనేక హామీలను నెరవేర్చకుండా.. కేంద్రంలో కాంగ్రెస్ వస్తేనే హామీలు నెరవేరుస్తామంటూ మోసం చేస్తున్నారని మండిపడ్డారు. అటు బీజేపీ, ఇటు కాంగ్రెస్ రాష్ట్రానికి చేసిందేమీ లేదని అన్నారు. తెలంగాణకు మేలు జరగాలంటే లోక్‌సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థులను గెలిపించాలని కేసీఆర్ ప్రజలకు పిలుపునిచ్చారు.












Click it and Unblock the Notifications