లెక్కలూ, వ్యూహాలు.. కేసీఆర్ టార్గెట్ '2019 ఎలక్షన్స్' (ఫోటోలు)
హైదరాబాద్ : ప్రతిపక్ష పార్టీలను ఖాళీ చేయడం మొదలు.. కొత్త జిల్లాల ఏర్పాటు దాకా తెలంగాణ సీఎం కేసీఆర్ నిర్ణయాలన్నీ వ్యూహాత్మకంగా సాగుతున్నవే. తెలంగాణలో ఇప్పటికే ఎదురులేని శక్తిగా దూసుకెళుతోన్న టీఆర్ఎస్ కు భవిష్యత్తులో కూడా ఏకఛత్రాధిపత్యం కట్టబెట్టేలా కేసీఆర్ పావులు కదుపుతున్నారు.
విజయదశమి నుంచే ఫోకస్ ప్రారంభమైంది :
విజయదశమి రోజు కొత్త జిల్లాల ఏర్పాటు అనంతరం అదేరోజు ఫామ్ హౌజ్ లో పార్టీ నేతలకు విందు ఇచ్చిన సీఎం కేసీఆర్.. భవిష్యత్తు రాజకీయాలను కూడా టీఆర్ఎస్ శాసించబోతుందని తేల్చేశారు. ఇందుకోసం పలు ఏజెన్సీలు, ఇంటలిజెన్స్ వర్గాలు క్షేత్రస్థాయిలో ప్రజాభిప్రాయ సేకరణ చేసినట్లు తెలుస్తోంది. పక్కా లెక్కలు చేతికందాకనే కేసీఆర్ ఆ ప్రకటన చేశారన్న వాదన బలంగా వినిపిస్తోంది.

ప్రతిపక్షాలకు ఒకవిధంగా మైండ్ గేమ్ :
ఫామ్ హౌజ్ లో పార్టీ నేతలకు ఇచ్చిన విందు సందర్బంగా.. వచ్చే ఎన్నికల్లో ప్రతిపక్షాలు ఆరేడు సీట్లకే పరిమితమడం ఖాయమని రిపోర్టులు చెబుతున్నట్లుగా.. కేసీఆర్ వెల్లడించారని వార్తలు వచ్చాయి. ఇది ఒకరకంగా ప్రత్యర్థి పార్టీలను దెబ్బతీయడానికి కేసీఆర్ ఇప్పటినుంచే రచించిన వ్యూహాంగాను భావించవచ్చు. ప్రతిపక్షాలకు అంత సత్తా లేదని కేసీఆర్ తేల్చేయడంతో.. జనంలోకి ఈ విషయం బలంగా చొచ్చుకెళ్లే అవకాశముంది. దీంతో ప్రత్యర్థి పార్టీల మైలేజీ మునుపటితో పోలిస్తే.. మరింత పడిపోయే అవకాశం లేకపోలేదు.
మొత్తంగా 'కేసీఆర్ సూపర్' :
తాజా సర్వేలో భాగంగా ఎక్కువమంది తెలంగాణ ప్రజానీకం సీఎంగా కేసీఆర్ పనితీరును భేష్ అన్నారనే విషయం వెల్లడవుతోంది. ప్రభుత్వ పాలన పట్ల ప్రజలంతా సానుకూలతను వ్యక్తం చేసినట్లు తాజా రిపోర్టుల్లో స్పష్టమైనట్లు చెబుతున్నారు. ఇప్పటికిప్పుడు ఎన్నిలు జరిగినా.. టీఆర్ఎస్ ను నిలువరించే సత్తా మరే పార్టీకి లేదని తెలియడంతో.. పార్టీలో ఏమాత్రం లొసుగులు కనబడకుండా కేసీఆర్ అంతర్గత వ్యూహాలు రచిస్తున్నట్లుగా కూడా తెలుస్తోంది.

అవినీతి బురద అంటుకున్న ఎమ్మెల్యేలకు హెచ్చరిక :
టీఆర్ఎస్ పాలన పట్ల ప్రజలంతా సంతృప్తి వ్యక్తం చేసినప్పటికీ.. కొంతమంది ఎమ్మెల్యేలు మాత్రం అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్నట్లుగా తాజా నివేదికల్లో తేలిందన్న చర్చ జరుగుతోన్న సంగతి తెలిసిందే. దీంతో సదరు ఎమ్మెల్యేలపై ప్రత్యేక ఫోకస్ పెట్టిన కేసీఆర్.. ఆయా నేతలను ఒక్కొక్కరిని తన వద్దకు పిలిపించుకుని మందలిస్తున్నట్లుగా తెలుస్తోంది. అలాగే పనితీరు సరిగా లేని నియోజకవర్గాల పట్ల అలసత్వాన్ని ప్రదర్శిస్తోన్న నేతలకు సైతం తీరు మార్చుకోవాలని కేసీఆర్ ఆదేశాలు జారీ చేసినట్లుగా సమాచారం.
మిషన్ భగీరథ :
ఎన్నికల హామిల్లో భాగంగా.. మిషన్ భగీరథ లాంటి హామిలను టీఆర్ఎస్ ప్రతిష్టాత్మకంగా ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇంటింటికీ నల్లా నీరివ్వకపోతే వచ్చే ఎన్నికల్లో ఓట్లు అడిగేది లేదని చెప్పారు కేసీఆర్. ఇప్పుడు రెండున్నరేళ్లు గడిచిపోయింది. మిషన్ భగీరథ కోసం 2017 డెడ్ లైన్ గా పెట్టుకున్న ప్రభుత్వం.. తొలుత దళితవాడల నుంచే దీనికి శ్రీకారం చుడుతున్నట్లు ప్రకటించింది. దీంతో ఈ ప్రాజెక్టు విషయంలో ప్రభుత్వానికి అలసత్వానికి తావివ్వకుండా చురుగ్గానే పనిచేస్తోందన్న సంకేతాలను జనంలోకి పంపించారు.

అయితే 2017 డెడ్ లైన్ నాటికి ఈ ప్రాజెక్టు పూర్తి స్థాయిలో అందుబాటులోకి వస్తుందా? రాదా? అన్నది టీఆర్ఎస్ సత్తాకు ఓ పరీక్ష. ఒకవేళ సగానికి పైగా పనులు పూర్తయినా.. మరో ఏడాదికి ప్రాజెక్టును పూర్తిస్థాయిలో అందుబాటులోకి తీసుకొచ్చే అవకాశముంది. ఏదేమైనా ఎన్నికలకు ముందే దీన్ని ఓ కొలిక్కి తీసుకురావాలనే యోచనలో టీఆర్ఎస్ ఉన్నట్లు స్పష్టమవుతోంది.
2019 టార్గెట్ :
మొత్తంగా 2019నాటికి రాష్ట్రంలో టీఆర్ఎస్ ను మహా రాజకీయ శక్తిగా నిలబెట్టాలనే యోచనలో ఉన్నారు కేసీఆర్. ఇందుకోసం ఇప్పటినుంచే పక్కా ప్లాన్ తో ముందుకెళుతున్నట్లు ఆయన కదలికలు స్పష్టం చేస్తున్నాయి. ఇప్పటివరకైతే అధికార పక్షాన్ని నిలువరించడంలో ప్రతిపక్షాలు ఎక్కడా సత్తా చాటినా దాఖలా లేదు. ఇది టీఆర్ఎస్ కు మరింత కలిసొచ్చే అంశం. దీంతో అటు ప్రజాభిప్రాయాలను ఎప్పటికప్పుడు నిశితంగా గమనిస్తూ.. 2019 ఎన్నికల్లో టీఆర్ఎస్ కు తిరుగులేకుండా చేయాలనుకుంటున్నారు కేసీఆర్.












Click it and Unblock the Notifications