50ఏళ్ళు పాలించిన కాంగ్రెస్ తో మీ బతుకులు మారాయా? సీఎం కేసీఆర్
BRS అధినేత, ముఖ్యమంత్రి K చంద్రశేఖర్ రావు ఈ రోజు పాలకుర్తి, నాగార్జున సాగర్, ఇబ్రాహీం పట్నం నియోజక వర్గాలలో ప్రజా ఆశీర్వాద సభల్లో పాల్గొంటున్నారు. సీఎం కేసీఆర్ పాలకుర్తి, నాగార్జున సాగర్ లలో ఈ మేరకు సంచలన వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ పార్టీపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడిన ఆయన కాంగ్రెస్ పాలనలో ప్రజల బ్రతుకులు మారలేదన్నారు.
తెలంగాణ ఆత్మగౌరవ ప్రతీకగా వచ్చిన బీఆర్ఎస్ పార్టీని మరోమారు గెలిపించాలని, తెలంగాణ ఆత్మగౌరవాన్ని నిలబెట్టాలని సీఎం కేసీఆర్ సూచించారు. పార్టీల చరిత్ర, నడవడిక చూసి ఓటేయాలని ప్రజలకు పిలుపునిచ్చిన కేసీఆర్ స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలు అయినా దేశంలో రావాల్సిన ప్రజాస్వామ్య పరిణితి ఇంకా రాలేదని పేర్కొన్నారు.

బీఆర్ఎస్ పార్టీ పుట్టిందే తెలంగాణ కోసమని పేర్కొన్న ఆయన ఇంటి పార్టీని గెలిపించాలన్నారు. ఎన్నికలంటే ఎందరో వస్తుంటారని, ఏవేవో చెబుతుంటారు అని అని ఓటు వేసే ముందు ఒక్కసారి ఆలోచించి ఓటు వేయాలని, నిజానిజాలు గమనించి ఓటు వేయాలని కోరుతున్నానని సీఎం కేసీఆర్ ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు.
పదేళ్ల ముందు పాలకుర్తి ఎలా ఉంది ఇప్పుడు ఎలా ఉందో ప్రజలు ఆలోచించాలని, గతంలో పాలకుర్తి నుంచి వేల సంఖ్యలో ప్రజలు వలస పోయే వారిని ఇప్పుడు ఇతర ప్రాంతాల నుంచి ఇక్కడికి వస్తున్నారని పేర్కొన్నారు. పాలకుర్తి నియోజకవర్గంలో రైతుల అవసరాలను తీర్చేందుకు లక్ష 30 వేల ఎకరాలకు సాగునీరు ఇచ్చామని కేసీఆర్ గుర్తు చేశారు.
దేశాన్ని 50 ఏళ్లపాటు పాలించిన కాంగ్రెస్ తో మన బతుకులు మారాయా అని ప్రశ్నించిన కెసిఆర్, కాంగ్రెస్ అధికారంలోకి వస్తే తెలంగాణా సర్వ నాశనం అవుతుందని అన్నారు. కాంగ్రెస్ నాయకుల గోల్మాల్ మాటలు విని ఆగం కావద్దని ఓటర్లకు తెలిపారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే రైతుబంధు, 24 గంటల విద్యుత్, ధరణి ఉండవని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. కనుక ఓటర్లు ఆచి తూచి నిర్ణయం తీసుకోవాలని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు.












Click it and Unblock the Notifications