కేసీఆర్‌ను కేటీఆరే నిర్బంధించారు: మహేశ్ కుమార్ గౌడ్ సంచలనం
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, గత ప్రభుత్వంపై,తీవ్ర విమర్శలు చేశారు టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ముమ్మాటికి అవకతవకలు జరిగాయని.. బాధ్యలుపై చట్ట ప్రకారమే చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. పదేళ్ల బీఆర్ఎస్ పాలన, ఏడాది కాంగ్రెస్ పాలనపై చర్చకు సిద్ధమన్నారు. ఫార్మాసిటీ ఒక చోట ఉండకూడదనే వికేంద్రీకరణ చేశామన్నారు.
లగచర్లలో భూమిలేనివారు అధికారులపై దాడి చేశారన్న మహేశ్ కుమార్ గౌడ్.. కేటీఆర్ ఉద్దేశపూర్వకంగా దాడి జరిపించాడని ఆరోపించారు. ఫార్మలా కారు రేసులో చేసిన తప్పేంటో కేటీఆర్‌కు తెలుసని.. ఆయన తప్పు చేశాడని ఫీలవుతున్నాడు కాబట్టే.. జైలుకు పోతా అంటున్నారన్నారు. కేసీఆర్ ఫ్యామిలీని జైలుకు పంపడం లేదేంటని ప్రజలు అడుగుతున్నారని చెప్పారు.

బీఆర్ఎస్ హయాంలో అవినీతి అధికారులపై పద్ధతి ప్రకారం చర్యలుంటాయని మహేశ్ కుమార్ గౌడ్ తెలిపారు. ప్రతిపక్ష హోదా ఉన్నప్పటికీ.. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఏడాదిగా బయటకు రావడం లేదన్నారు. ఆయన ఎక్కడ దాక్కున్నారని ప్రశ్నించారు. కేసీఆర్‌ను కేటీఆర్ నిర్బంధించారని ఆరోపించారు. పదేళ్లలో బీఆర్ఎస్ చేసిన రుణమాఫీ కంటే తాము 9 నెలల్లో ఎక్కువ చేశామని చెప్పారు.
నిర్బంధ పాలన నుంచి ప్రజాపాలన తీసుకొచ్చామన్న మహేశ్ కుమార్ గౌడ్.. అందుకే బీఆర్ఎస్ లో గెలిచిన ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారన్నారు. ప్రజలు కోరినట్లు పాలన సాగుతోంది కాబట్టే.. విజయోత్సవాలు చేస్తున్నామన్నారు. బీఆర్ఎస్, బీజేపీ నేతలు సోషల్ మీడియాను మితిమీరి వినియోగిస్తూ.. ప్రభుత్వంపై అసత్యాలు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు.
హైడ్రా అనేది హైదరాబాద్ నగరానికి వరమని మహేశ్ కుమార్ గౌడ్ వ్యాఖ్యానించారు. ఆక్రమణలకు గురైన చెరువులు, కాలువలను పూర్తిగా బాగు చేస్తే.. వయనాడ్‌లో చోటు చేసుకున్న ఉపద్రవాలు ఇక్కడ వచ్చే అవకాశం ఉండదన్నారు. భవిష్యత్ తరాలకు ఉపయోగపడే విధంగా సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయం తీసుకున్నారన్నారు. మూసీ ప్రక్షాళన అవసరమని పేర్కొన్నారు. పేదలెవరూ నష్టపోకుండా రాష్ట్ర ప్రభుత్వం పునరావాసచర్యలు తీసుకుంటుందన్నారు.












Click it and Unblock the Notifications