కవిత ఇంటికి తల్లి శోభ - కీలక మలుపు..!!
కేసీఆర్ కుమార్తె వివాదం కొత్త మలుపు తిరుగుతోంది. కవిత వరుసగా చేస్తున్న వ్యాఖ్యలతో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తన కుమార్తెను పార్టీ నుంచి సస్పెండ్ చేసారు. దీనికి కౌంటర్ గా కవిత తన ఎమ్మెల్సీ పదవికి.. పార్టీకి రాజీనామా చేసారు. బీఆర్ఎస్ నేత హరీష్ పైన కవిత చేసిన ఆరోపణలు సంచలనంగా మారాయి. కవిత కొత్త పార్టీ ఏర్పాటు చేస్తారనే చర్చ వినిపిస్తోంది. ఇదే సమయంలో కుమార్తె కవిత నివాసానికి తల్లి శోభ రావటం ఆసక్తి కరంగా మారింది. దీంతో, అసలు ఏం జరుగుతోందనే చర్చ మొదలైంది.
మాజీ సీఎం, బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ సతీమణి శోభ.. ఎమ్మెల్సీ కవిత నివాసానికి వెళ్లారు. అల్లుడు అనిల్ పుట్టిన రోజు కార్యక్రమానికి ఆమె హాజరయ్యారు. కొద్ది రోజులుగా కవిత వ్యవహారంలో ఆసక్తి కర పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఏకంగా పార్టీ నుంచి కవితను సస్పెండ్ చేస్తూ కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు. ఈ వ్యాఖ్యల సమయంలోనే కేసీఆర్ ను కలిసేందుకు కవిత ప్రయత్నించారు. పార్టీకి రాజీనామా చేసిన కవిత తన భవిష్యత్ కార్యాచరణ పైన మద్దతు దారులతో మంత్రాంగం సాగిస్తున్నారు.

ఈ సమయంలోనే తల్లి శోభ కుమార్తె శోభ ఇంటికి వచ్చారు. కవితకు ప్రత్యేకంగా కొన్ని సూచనలు చేసినట్లు బీఆర్‌ఎస్ వర్గాలు తెలిపాయి. కొద్ది రోజులు నిదానంగా ఉండాలని, అన్నీ సర్దుకుంటాయని చెప్పినట్లు సమాచారం. తన తల్లి ఇంటి రావటంతో కవిత సైతం ఉద్వేగానికి గురయ్యారని తెలుస్తోంది.
కవిత సస్పెన్షన్ తరువాత పలువురు బీఆర్ఎస్ నేతలు కీలక వ్యాఖ్యలు చేసారు. హరీష్ పైన అవినీతి ఆరోపణలు చేయటాన్ని తప్ప బట్టారు. కేసీఆర్ తన కుమార్తె కంటే పార్టీ ముఖ్యమనే సంకేతాలు ఇచ్చారని చెప్పుకొచ్చారు. ఇక, హరీష్ కవిత వ్యాఖ్యల పైన సున్నితంగానే స్పందించారు. తాము కేసీఆర్ నాయకత్వంలోనే పని చేస్తామని తేల్చి చెప్పారు. లండన్ పర్యటన నుంచి వచ్చిన తరువాత కేసీఆర్ తోనూ సమావేశం అయ్యారు.
కవిత వ్యవహారంతో కేసీఆర్ ఫ్యామిలీలో వివాదాలు.. విభేదాలు తారా స్థాయికి చేరాయనే ప్రచారం సాగుతోంది. కాంగ్రెస్, బీజేపీ మరింతగా బీఆర్ఎస్ ను బలహీన పర్చేందుకు ఇదే సరైన సమయంగా భావిస్తున్నాయి. కాగా.. ఇప్పుడు కవిత ఇంటికి తల్లి శోభ రావటం రాజకీయంగానూ ప్రాధాన్యత సంతరించుకుంది. గత వారమే కవిత ఇంట్లో జరిగిన కార్యక్రమానికి శోభ రావాల్సి ఉన్నా.. తాజా పరిణామాలతో రాలేదని.. ఇప్పుడు వచ్చారని పార్టీ నేతలు చెబుతున్నారు.












Click it and Unblock the Notifications