ఆ రోజే ఖైరతాబాద్ గణేష్ నిమజ్జనం.. ఈ సారి భారీ మార్పులు చేశారుగా..!
హైదరాబాద్ మహానగరంలో గణేష్ నిమజ్జనాలు జోరందుకున్నాయి. ఆదివారం నాడు ఐదో రోజు కావడం, సెలవురోజు కావడంతో దాదాపు నాలుగు వేల విగ్రహాలు నిమజ్జనం జరిగినట్లు ఖైరతాబాద్ జోన్ ఏసీపీ శ్రీనివాస్ తెలిపారు. ఈ నెల 4,5,6 తేదీల్లో జరగనున్న గణేష్ శోభాయాత్ర నేపథ్యంలో కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. ఈ మేరకు ఖైరతాబాద్ గణేష్ నిమజ్జన ఏర్పాట్లపై ఖైరతాబాద్ జోన్ ఏసీపీ శ్రీనివాస్ తో వన్ ఇండియా తెలుగు ప్రత్యేక ఇంటర్వూ చేసింది. ఖైరతాబాద్ మహా గణపతి నిమజ్జనం సెప్టెంబర్ 6, 2025న అనంత చతుర్దశి రోజున జరగనుందని తెలిపారు.
"ప్రస్తుతం ట్యాంక్ బండ్ వద్ద 1000 మంది పోలీసులను మోహరించాం. పీపుల్ ప్లాజాలో 8 క్రేన్ లు ఏర్పాటు చేశాం. నల్లగుట్ట, పీవీ ఘాట్ ప్రాంతాల్లో రెండు చొప్పున క్రేన్ లు ఏర్పాటు చేశాం. ఇందిరా పార్క్ ఎదురుగా ఎన్టీఆర్ స్టేడియంలో నాలుగు క్రేన్ లు ఏర్పాటు చేయడం జరిగింది. ఆదివారం ఐదోరోజు కావడంతో గణేష్ నిమజ్జనాలు ఊపందుకున్నాయి. గత రాత్రి దాదాపు నాలుగు వేల విగ్రహాలు నిమజ్జనం జరిగాయి. ఇక ఖైరతాబాద్ గణేష్ విగ్రహం నిమజ్జనం కోసం ప్రత్యేకమైన ఏర్పాట్లు చేశాం. ఖైరతాబాద్ గణేష్ ను ఊరేగింపుగా తీసుకొచ్చి ఎన్టీఆర్ మార్గ్ వద్ద నిమజ్జనం చేయనున్నారు. ఇందుకోసం అక్కడ ప్రత్యేకమైన స్థలాన్ని కేటాయించాం. అలాగే ఖైరతాబాద్ గణేష్ శోభాయాత్ర సందర్భంగా దారిలో ఎలాంటి విద్యుత్ కేబుల్స్ , వైర్లు లేకుండా చర్యలు తీసుకున్నాం. పై అధికారుల సూచనలను పాటిస్తున్నాం" అని ఖైరతాబాద్ జోన్ ఏసీపీ శ్రీనివాస్ వెల్లడించారు.

సెప్టెంబర్ 7న చంద్రగ్రహణం ఉండటం వల్ల గణేశ్ నిమజ్జనం ఎప్పుడు జరుగుతుందో అనేది చాలా మందికి అనుమానం ఉంది. అయితే దీనిపై గణేష్ ఉత్సవ సమితి క్లారిటీ ఇచ్చింది. సెప్టెంబర్ 6వ తేదీనే విశ్వశాంతి మహా గణపతిని నిమజ్జనం చేయనున్నట్లు అధికారికంగా ప్రకటించింది. ఇక ఈ సంవత్సరం ఖైరతాబాద్ గణపతిని శ్రీ విశ్వశాంతి మహాశక్తి గణపతిగా 69 అడుగుల ఎత్తులో ప్రతిష్టించిన విషయం తెలిసిందే. అలాగే ఈ నెల 4,5,6 తేదీల్లో జరగనున్న గణేష్ శోభాయాత్ర నేపథ్యంలో భారీ సంఖ్యలో విగ్రహాలు ట్యాంక్ బండ్ కు చేరతాయని అంచనా. భక్తులకు తాగునీరు, వైద్య సేవలు, భద్రతా బందోబస్తు, ట్రాఫిక్ నియంత్రణ వంటి అన్ని చర్యలు తీసుకున్నట్లు అధికారులు తెలిపారు.












Click it and Unblock the Notifications