తెరాస గెలిస్తే రాజకీయాల్లో ఉండను, కేసీఆర్ కూడా: కోమటిరెడ్డి జోస్యం
హైదరాబాద్: 2019 సార్వత్రిక ఎన్నికలలో మరోసారి తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) గెలిస్తే తాను రాజకీయాల నుంచి తప్పుకుంటానని మాజీ మంత్రి, కాంగ్రెస్ పార్టీ నల్గొండ జిల్లా ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకట రెడ్డి బుధవారం అన్నారు.
ఆ ఎన్నికల్లో తెరాస అధికారంలోకి రాకపోవడమే కాకుండా ముఖ్యమంత్రి కేసీఆర్ తన సొంత నియోజకవర్గమైన గజ్వెల్‌లో కూడా గెలవలేరని జోస్యం చెప్పారు. ఆరోగ్య శ్రీ, డబుల్ బెడ్ రూం ఇళ్లు దళితులకు మూడు ఎకరాల భూమి వంటి ఎన్నో హామీలు ఇచ్చారని చెప్పారు.
వాటన్నంటిని కేసీఆర్ అటకెక్కించారన్నారు. 2019లో కాంగ్రెస్ పార్టీయే అధికారంలోకి వస్తుందని చెప్పారు. కొత్త జిల్లాల వ్యవహారం పిచ్చోడి చేతిలో రాయిలా ఉందన్నారు. అడిగిన వారికల్లా జిల్లా అంటూ అపహాస్యం చేస్తున్నారని మండిపడ్డారు. మోసపూరిత మాటలతో ప్రజలను మభ్య పెడుతున్నారన్నారు.

కేకే నివాసంలో హైపవర్ కమిటీ భేటీ
బంజారాహిల్స్‌లోని ఎంపీ కె కేశవరావు నివాసంలో ఉన్నత స్థాయి కమిటీ సమావేశమైంది. ప్రజల నుంచి వస్తున్న డిమాండ్లు సహా ఏఏ మండలాలతో కొత్త జిల్లాలు ఏర్పాటు చేయాలన్న అంశాలను కమిటీ పరిశీలిస్తోంది.
ముసాయిదా నోటిఫికేషన్లో ప్రకటించిన 17 జిల్లాలు కాకుండా మరో నాలుగు ప్రాంతాల నుంచి వచ్చిన జిల్లా ఏర్పాటు డిమాండ్లను పరిశీలించడానికి సీఎం ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేశారు. ఈ కమిటీలో ఎంపీ కె.కేశవరావు నాయకత్వంలో డిప్యూటీ సీఎం మహమూద్ అలీ, మంత్రులు జగదీశ్వర్ రెడ్డి, పోచారం శ్రీనివాస్ రెడ్డి, జోగు రామన్న సభ్యులుగా ఉన్నారు. సభ్యులను పలువురు నేతలు కలుస్తున్నారు.












Click it and Unblock the Notifications