కొండా సురేఖపై మూకుమ్మడి దాడికి రెడీ.. నెక్స్ట్ ఎన్నికలే టార్గెట్ గా వ్యూహం!
వరంగల్ తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే, మంత్రిగా బర్తరఫ్ అయిన కొండా సురేఖ తాజా కార్యకర్తలు, ముఖ్య నాయకుల భేటీతో లోకల్ రాజకీయం ఒక్కసారిగా వేడెక్కింది. తూర్పు ఎమ్మెల్యే కొండా సురేఖ మంత్రి పదవి బర్తరఫ్ కావడం, ఆ తరువాత జరుగుతున్న పరిణామాలు ఇక్కడి రాజకీయ ముఖచిత్రాన్ని పూర్తిగా మార్చేసింది. నువ్వా నేనా తేల్చుకుందాం అన్నట్టు ఆధిపత్యం కోసం నలుగురు ముఖ్య నేతలు తలపడనున్నారు. ఇప్పటినుండే ఎవరి వ్యూహాల్లో వాళ్ళు ఉన్నారు.
పదవి పోయినప్పటికీ కొండా సురేఖ కాంగ్రెస్ లోనే కంటిన్యూ అవుతానని చెప్పటంతో సురేఖ వరంగల్ తూర్పు నుండి ఎన్నికల బరిలో ఉంటారని స్పష్టం అయ్యింది. అంతేకాదు మళ్ళీ టికెట్ నాకే, నేనే గెలిచి తీరుతా, మళ్ళీ మంత్రిని అవుతానని కొండా సురేఖ చెప్పటం ఆమె తూర్పు విడిచిపెట్టేది లేదనే అంశం స్పష్టం చేస్తుంది. ఈ క్రమంలో తూర్పులో తమ పట్టు తగ్గలేదని నిరూపించుకోవడానికి కొండా దంపతులు తీవ్రంగా శ్రమిస్తున్నారు.

మరోవైపు బీసీ సామాజిక వర్గంలో బలమైన నేతగా బస్వరాజు సారయ్యకు మంచి పేరు ఉంది. సురేఖ నిష్క్రమణతో వచ్చిన ఖాళీని భర్తీ చేసి నియోజకవర్గంలో మళ్లీ తన ఆధిపత్యాన్ని నిలబెట్టుకోవాలని చూస్తున్నారు. అందుకోసం కొండా సురేఖ క్యాడర్ ను తనవైపు తిప్పుకునే పనిలో ఉన్నారు. వచ్చే ఎన్నికలలో తనకే టికెట్ ఇస్తారనే ధీమాతో ఉన్నారు.
పద్మశాలి సామాజిక వర్గానికి చెందిన గుండు సుధారాణి,తాను కూడా బీసీ మహిళా నేతగా వచ్చే ఎన్నికల్లో టికెట్ ఆశించే అవకాశం ఉంది. వరంగల్ నగరంలో తనకున్న పద్మశాలి ఓటు బ్యాంక్, క్షేత్రస్థాయి బలంతో తూర్పు రాజకీయంలో కీలక పాత్ర పోషించడానికి సిద్ధమయ్యారు. ఈ క్రమంలో స్థానికంగా పట్టు కోసం ఆమె సైతం ప్రయత్నాలు మొదలుపెట్టారు.
మైనార్టీ వర్గానికి చెందిన డీసీసీ అధ్యక్షుడు ఆయుబ్ పోటీలోకి రావడం వరంగల్ తూర్పు రాజకీయాలను కొత్త మలుపు తిప్పనుంది. గత ఎన్నికల్లో కొండా సురేఖ గెలుపులో మైనార్టీల పాత్ర అత్యంత కీలకమని, ఆ విషయాన్ని కొండా దంపతులే స్వయంగా అనేకసార్లు చెప్పారు.అయితే సురేఖకు చెక్ పెట్టేలా తమ సామాజికవర్గం మద్దతు పూర్తిగా తనకే ఉందని, తాను కూడా రేసులో ఉంటానని ఆయూబ్ చెప్తున్నారు. ఆయన కూడా టికెట్ ఆశావహుల్లో ఉన్నారు.
ఓ వైపు సామాజిక సమీకరణాలు, మరోవైపు నాయకుల మధ్య ఆధిపత్య పోరుతో ఇప్పటి నుండే వరంగల్ తూర్పు రాజకీయం రస కందాయంలో పడింది. ఏది ఏమైనా కాంగ్రెస్ లో, అందులోనూ వరంగల్ తూర్పులో ఇప్పటి నుండే ఎన్నికల వేడి కనిపిస్తుంది.కాంగ్రెస్ ఎన్నికల వ్యూహాలు స్థానికంగా చర్చకు కారణం అవుతున్నాయి.














Click it and Unblock the Notifications
