కొండా సురేఖ బర్తరఫ్ పై కొండా మురళి, కొండా సుస్మిత సంచలన వ్యాఖ్యలు
తెలంగాణ రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకున్న సంగతి తెలిసిందే. కొద్ది సేపటి క్రితమే తెలంగాణ మంత్రివర్గం నుంచి కొండా సురేఖ బర్తరఫ్ కు గవర్నర్ శివప్రతాప్ శుక్లా ఆమోదం తెలిపారు. ఈ మేరకు సీఎం రేవంత్ రెడ్డి సిఫార్సుకు గవర్నర్ నుంచి ఆమోదం లభించింది. దీంతో కొండా సురేఖను మంత్రివర్గం నుంచి తొలగిస్తూ లోక్ భవన్ అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది. అయితే కొండా సురేఖ బర్తరఫ్ పై ఆమె కుటుంబ సభ్యులు సంచలన వ్యాఖ్యలు చేశారు.
కొండా సురేఖ భర్త కొండా మురళి ఎక్స్ వేదికగా సంచలన పోస్టు పెట్టారు. "ఇదేం కొత్త కాదు.. ఉన్నది ఉన్నట్టు, కుండా బద్దలు కొట్టినట్టు మాట్లాడుతే ఎవ్వరు తట్టుకోరు..! ఇవ్వాళ మేము, రేపు ఎవ్వరో. పదవులు ఉన్నా లేకున్న మా గౌరవం మాకు ఉంటుంది. మేము ప్రతిదానికీ స్పందిచకపోవచ్చు కానీ ప్రతీ ఒక్కటి గమనిస్తూనే ఉంటాం" అని కొండా మురళి తన అధికారిక ఎక్స్ వేదికగా పోస్టు పెట్టారు. అంతేకాక "అన్ని దరిద్రాలు ఏకమై మా మీదా చేస్తున్న చేసిన రాజకీయ దాడులకు దృఢంగా నిలబడతాం, మొండిగా ఎదురు వెళ్లగలం" అని తెలిపారు.
మరోవైపు మధ్యాహ్నం సురేఖ బర్తరఫ్ వార్తలు బయటకు రాగానే కొండా మురళి తన నివాసం వద్ద తనదైన శైలిలో రియాక్షన్ ఇచ్చారు. బయటకు వచ్చి విలేకరులను చూస్తూ మీసం మెలేశారు. తాము ఏమాత్రం చింతించడం లేదన్నట్లుగా సంకేతాలు ఇచ్చారు. ఎవరూ అధైర్యపడొద్దని.. భరోసాతో ఉండాలని పరోక్షంగా కార్యకర్తలకు కొండా మురళి సూచించారు.

ఇక కొండా సురేఖ కుమార్తె కొండా సుస్మిత ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రేవంత్ రెడ్డి వన్ టైం జెడ్పీటీసీ, వన్ టైం ఎమ్మెల్సీ, వన్ టైమ్ ఎమ్మెల్యే, వన్ టైమ్ ఎంపీ.. మా అమ్మ ఆరుసార్లు ఎమ్మెల్యే.. రేవంత్ రెడ్డి మా అమ్మను అవమానించారు. బీసీలను రేవంత్ రెడ్డి టార్గెట్ చేశారు. నేను పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడలేదు. ఒక వ్యక్తికి వ్యతిరేకంగా మాత్రమే మాట్లాడాను. బండి సంజయ్ కొడుకుపై పోక్సో కేసు నమోదైనప్పుడు.. కొడుకు చేసిన తప్పుకు బండి సంజయ్‌ను ఎలా అరెస్ట్ చేస్తారని రేవంత్ రెడ్డి అన్నారు. మరి నేను చేసిన వ్యాఖ్యలకు మా అమ్మను ఎలా బలి చేస్తారు..? అని కొండా సుస్మిత హాట్ కామెంట్స్ చేశారు.












Click it and Unblock the Notifications