యువతులపై దాడి,వేధింపుల కేసు... కోయిలమ్మ నటుడు జైలుకు తరలింపు...
కోయిలమ్మ సీరియల్ నటుడు సమీర్ అలియాస్ అమర్‌ను రాయదుర్గం పోలీసులు చర్లపల్లి జైలుకు తరలించారు. బుధవారం(ఫిబ్రవరి 10) అమర్‌ను పోలీసులు కూకట్‌పల్లి కోర్టు ఎదుట హాజరుపరచగా.. న్యాయస్థానం అతనికి రిమాండ్ విధించింది. దీంతో పోలీసులు అతన్ని చర్లపల్లి కారాగారానికి తరలించారు.
గత నెల 27వ తేదీన శ్రీవిద్య,అపర్ణ అనే ఇద్దరు యువతులపై దాడికి పాల్పడిన కేసులో అమర్‌ను పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఈ ఇద్దరు యువతులు స్వాతి అనే మరో యువతితో కలిసి హైదరాబాద్ మణికొండలో బొటిక్ వ్యాపారం నిర్వహిస్తున్నారు. ఇటీవల శ్రీవిద్య, అపర్ణలతో స్వాతికి విభేదాలు తలెత్తాయి. ఈ విషయంలో ముగ్గురు గొడవపడ్డారు.


ఇదే క్రమంలో జనవరి 27న స్వాతి అమర్‌ను,మరో ముగ్గురు ఆకతాయిలను వెంటపెట్టుకుని ఆ బొటిక్ వద్దకు వెళ్లింది. ఆ సమయంలో అమర్ తమపై దాడి చేయడంతో పాటు అసభ్య పదజాలంతో దూషించాడని,లైంగికంగా వేధించాడని శ్రీవిద్య,అపర్ణ రాయదుర్గం పోలీసులకు ఫిర్యాదు చేశారు.దీంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు అమర్‌ను అదుపులోకి తీసుకున్నారు.
మరోవైపు అసలు ఈ గొడవకు తనకు ఎటువంటి సంబంధం లేదని.. తామంతా స్నేహితులమే అని.. కుట్రప్రకారమే తనని ఇందులో ఇరికించారని గతంలో అమర్ ఆరోపించాడు. ఓ టీవీ జర్నలిస్ట్ తనపై కుట్ర పన్నిందని సంచలన వ్యాఖ్యలు చేశాడు. లైంగిక వేధింపులకు పాల్పడ్డానని... తాగిన మత్తులో దాడి చేశానని ఆరోపించడం పూర్తిగా అవాస్తవమని పేర్కొన్నాడు. ఎఫ్ఐఆర్ కాపీలో 509, 506 సెక్షన్ల కింద కేసు పెట్టారని... అది చాలా చిన్న కేసు అని అన్నారు. స్నేహితుల మధ్య గొడవలోకి వేరే వ్యక్తి రావడంతో గొడవ పెద్దదైందన్నారు.