ఏపీ, తెలంగాణకు నీటి కేటాయింపులు ఇలా!
తెలగు రాష్ట్రాల మధ్య కీలక ప్రాజెక్టుల నుంచి నీటి కేటాయింపుల విషయంలో స్పష్టత వచ్చింది. వేసవి కాలంలో సాగునీరు, ముఖ్యంగా తాగునీటి కోసం శ్రీశైలం, నాగార్జున సాగర్ నుంచి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు నీటి కేటాయింపులను కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డ్ (KRBM) పూర్తి చేసింది. శ్రీశైలం, నాగార్జున సాగర్ ప్రాజెక్టుల్లో 70 టీఎంసీల నీళ్లు మాత్రమే ఉన్నాయని.. రెండు తెలుగు రాష్ట్రాలు అత్యంత పొదుపుగా నీటిని వాడుకోవాలని సూచించింది.
ప్రతి 15 రోజులకు ఒకసారి సమీక్ష చేసుకుని.. నీటిని విడుదుల చేసుకునే విధంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల అధికారులకు సూచనలు చేసింది. ఇక, నీటి కేటాయింపుల విషయానికొస్తే శ్రీశైలం, నాగార్జున సాగర్ జలాల్లో తాగునీటికి మొదటి ప్రాధాన్యత ఇవ్వాలని సమావేశంలో నిర్ణయించారు.

పంటల అవసరాలకు అనుగుణంగా రెండు తెలుగు రాష్ట్రాలకు నీటి విడుదలకు అంగీకారం కుదిరింది. ఫిబ్రవరి 24 నాటికి రెండు ప్రాజెక్టులలో 70 టీఎంసీల నీటి లభ్యత ఉంది. దీంతో సాగర్ ఎడమ కాలువ నుంచి తెలంగాణ అవసరాలకు 9 వేల క్యూసెక్లు నీటి విడుదలకు నిర్ణయం తీసుకున్నారు.
నాగార్జున సాగర్ కుడి కాలువ నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి 7 వేల క్యూసెక్కుల విడుదలకు ఆమోదం తెలిపారు. శ్రీశైలం నుంచి తెలంగాణకు కొనసాగనున్న 2400 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తారు. శ్రీశైలం నుంచి ఏపీలోని మల్యాల, హంద్రీనీవా నుంచి 2200 క్యూసెక్కుల నీటిని విడుదల చేయనున్నారు.
తాగునీటికి ప్రాధాన్యత ఇస్తూనే పంటలను కాపాడుకునేలా ప్రణాళికతో ముందుకు వెళ్లాలని తెలంగాణ, ఏపీకి కేఆర్‌బీఎం సూచించింది. రెండు ప్రాజెక్టుల్లో తక్కువ నీరు ఉన్నందున నీటిని వృధా చేయకుండా జాగ్రత్తగా వాడుకోవాలని కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డ్ రెండు తెలుగు రాష్ట్రాలకు స్పష్టం చేసింది.












Click it and Unblock the Notifications