వచ్చారు.. తిన్నారు.. తాగారు.. వెళ్లారు : అమిత్ షా టూర్ పై కేటీఆర్ -హరీష్ సెటైర్..!!
కేంద్ర హోం మంత్రి అమిత్ షా రాష్ట్ర పర్యటన రాజకీయంగా విమర్శలు - ప్రతివిమర్శలకు వేదిక అయింది. అమిత్ షా హైదరాబాద్ పర్యటన ముందు నుంచే టీఆర్ఎస్ - కాంగ్రెస్ నేతలు ట్వీట్లు - లేఖలతో ప్రశ్నలు సంధించారు. కొంత కాలంగా సీఎం కేసీఆర్ కేంద్ర ప్రభుత్వం - బీజేపీ లక్ష్యంగా తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతున్నారు. అదే విధంగా కేంద్ర హోం మంత్రి అమిత్ షా సైతం బహిరంగ సభలో తెలంగాణ సీఎం పైన పెద్ద ఎత్తున ఆరోపణలు చేసారు. అవినీతి - అసమర్ధ ప్రభుత్వం అంటూ ధ్వజమెత్తారు. టీఆర్ఎస్ - ఎంఐఎం పార్టీలను కలిపి టార్గెట్ చేసారు.
బీజేపీ అంటే ఇదీ అంటూ పోస్ట్
టీఆర్ఎస్ స్టీరింగ్ ఎంఐఎం చేతిలో ఉందంటూ విమర్శించారు. ఇక, అమిత్ షా పర్యటన పూర్తయిన తరువాత..మంత్రి కేటీఆర్ పరోక్షంగా స్పందించారు. ఆయన ఈ మేరకు ఒక ట్వీట్ చేసారు. మొన్ననే ఒక టూరిస్ట్ వచ్చి వెళ్లాడు.. ఇవాళ మరో టూరిస్ట్ వచ్చాడంటూ ట్వీట్ చేశారు. ప్రస్తుతం రాష్ట్రంలో పొలిటికల్ టూరిస్టుల సీజన్ నడుస్తోందని ఎద్దేవా చేశారు.
వచ్చాడు.. తిన్నాడు.. తాగాడు.. వెళ్లాడు.. అంటూ అమిత్ షాను ఉద్దేశించి ట్విటర్‌లో సైటైర్ వేశారు. తన ట్వీట్ లో భాగంగా.. ఎనిమిదేళ్లలో తెలంగాణకు ఏమి ఇవ్వలేదని కేటీఆర్ ఆరోపించారు. ఇప్పటికీ కూడా అదే తంతు ఇంకా కొనసాగుతోందన్నారు. భాజపా అంటే 'బక్వాస్ జుమ్లా పార్టీ' అంటూ పోస్టు చేసారు.
వలస పక్షుల దినోత్సవం
ఇక, మరో మంత్రి హరీష్ రావు సైతం కేంద్రహోంశాఖ మంత్రి అమిత్‌షా పర్యటనపై సెటైరికల్‌గా స్పందించారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు. ''వలస పక్షులు వస్తుంటాయి.. పోతుంటాయి. ఇష్టమైన ప్రదేశాలు, ఆహారం ఆస్వాదించి సంతోషంగా వెళ్తాయి. ఇవాళ ప్రపంచ వలస పక్షుల దినోత్సవం కావడం యాదృచ్ఛికం'' అని హరీశ్‌రావు ట్విటర్‌లో పేర్కొన్నారు. ఈ ట్వీట్‌కు #AmitShahVisitsTelangana, #WorldMigratoryBirdDay హ్యాష్ ట్యాగ్‌లతో పాటు పక్షులు ఎగురుతూ వెళ్తున్న ఫొటోను ఆయన పోస్ట్ చేశారు.

ముదిరిన పొలిటికల్ వార్
అమిత్ షా పర్యటన సమయంలో ముఖ్యమంత్రి కేసీఆర్ లక్ష్యంగా చేసిన ఆరోపణలు.. విమర్శల పైన రియాక్ట్ అయ్యేందుకు టీఆర్ఎస్ నేతలు సిద్దం అయ్యారు. ఇదే సమయంలో..అమిత్ షా పర్యటన.. బహిరంగ సభ..తొలి సారి తీవ్ర స్థాయిలో సీఎం కేసీఆర్ లక్ష్యంగా ఆరోపణలు చేయటం.. ఎన్నికలకు సిద్దమని ప్రకటించటం పైన బీజేపీ నేతలు ఖుషీ అవుతున్నారు. ఈ సభతో కేడర్ లో జోష్ వచ్చిందంటూ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అయితే, బీజేపీ సభలో ఏ నేత కాంగ్రెస్ గురించి ప్రస్తావించకపోవటం సైతం ఇప్పుడు రాజకీయంగా చర్చకు కారణమైంది.