ఆ ప్రచారమే బీఆర్ఎస్ ఓటమికి కారణం: కేటీఆర్!!
తెలంగాణా రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలలో ఓటమికి సోషల్ మీడియాలో జరిగిన దుష్ప్రచారమే కారణమని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. బీఆర్ఎస్ అధికారంలో ఉన్న తొమ్మిదిన్నర ఏళ్లలో రెండు లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేశామని.. దేశంలో ఏ రాష్ట్రంలోనైనా ఇంతకంటే ఎక్కువ ఉద్యోగాలు ఇచ్చామని ఎవరైనా నిరూపిస్తే తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని కాంగ్రెస్ , బీజేపీ పార్టీలకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సవాల్ విసిరారు.
రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఎన్ని హామీలు అమలుచేసింది?
ఈరోజు కొత్తగూడెం లో జరిగిన గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ సన్నాహక సమావేశంలో పాల్గొన్న ఆయన నల్గొండ ఖమ్మం వరంగల్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీగా తమ పార్టీ అభ్యర్థి ఏనుగుల రాకేష్ రెడ్డిని గెలిపించాలని కోరారు. రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చిన ఈ 6 నెలల్లో తెలంగాణలో ఏం జరుగుతుందో అందరూ గమనించాలని కేటీఆర్ అన్నారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం రైతులకు ఎన్ని హామీలు ఇచ్చిందో వాటిలో ఇప్పటివరకు ఎన్ని అమలు చేసిందో ఆలోచించాలన్నారు.

వారు చెప్పేవి అబద్ధాలు
డిసెంబర్ 9నే 2 లక్షల రుణమాఫీ చేస్తానని మోసం చేశారు. నాట్లు వేయాల్సిన సమయంలో ఇవ్వాల్సిన రైతు భరోసాను ఓట్లు వేసే టైంలో ఇచ్చారు. 6 గ్యారెంటీలలో 5 అమలు చేశామని ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న రేవంత్ రెడ్డే ధైర్యంగా అబద్ధాలు చెబుతున్నారని విమర్శించారు. రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ కూడా మహాలక్ష్మి పథకం కింద మహిళల ఖాతాల్లో 2500 ఇప్పటికే జమ చేశామని అబద్ధపు ప్రచారాలు చేస్తున్నారని కేటీఆర్ దుయ్యబట్టారు.
అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి అందుకే
65 ఏళ్ల కాంగ్రెస్ పాలనలో తెలంగాణలో మూడే మూడు మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేస్తే.. కేసీఆర్ ప్రభుత్వంలో 33 కొత్త కాలేజీలు కట్టామని కేటీఆర్ అన్నారు. పొరపాటున కాంగ్రెస్ కు మళ్ళీ ఓటేస్తే సింగరేణి కూడా ప్రైవేట్ పరం చేస్తారన్నారు. అభివృద్ధి పనులు ఎన్నో చేసినా.. సోషల్ మీడియాలో తమపై, తమ పార్టీపై జరిగిన దుష్ప్రచారం వల్లే అసెంబ్లీ ఎన్నికల్లో తాము ఓడిపోయామన్నారు.
అబద్దపు ప్రచారాలు, మోసాలపై ధిక్కార స్వరం వినిపించండి
రేవంత్ రెడ్డి అబద్ధపు ప్రచారాలు, మోసాలపై ధిక్కార స్వరం వినిపించాలంటే ఈ ఎమ్మెల్సీ ఎన్నికల్లో తమ పార్టీ అభ్యర్థినే గెలిపించాల్సిందిగా సమావేశానికి హాజరైన పట్ట భద్రులకు కేటిఆర్ విజ్ఞప్తి చేశారు. రాష్ట్రంలో బీజేపీని, కాంగ్రెస్ ను నమ్మితే నాశనం చేస్తారని, నట్టేట ముంచుతారని కేటీఆర్ అన్నారు.












Click it and Unblock the Notifications