రేవంత్ రెడ్డి ఐపీఎల్ మ్యాచుల్లో.. కేసీఆర్ రైతులకోసం మండుటెండల్లో: కేటీఆర్ సెటైర్లు!!
తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కు, తాజా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి మధ్య వ్యత్యాసాన్ని చెప్పారు మాజీ మంత్రి బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. రేవంత్ రెడ్డి ప్రభుత్వం దున్నపోతుతో సమానం అంటూ కేటీఆర్ రేవంత్ రెడ్డిపై నిప్పులు చెరిగారు. ప్రతిపక్షంలో ఉన్న తమ నేత కేసీఆర్ ఎర్రటి ఎండలో ప్రజల మధ్యలో తిరుగుతుంటే, రేవంత్ రెడ్డి ఐపీఎల్ మ్యాచ్ లలో తిరుగుతున్నాడని ధ్వజమెత్తారు.
రేవంత్ రెడ్డి గుంపు మేస్త్రి, ప్రధాని తాపీ మేస్త్రి
బీఆర్ఎస్ ప్రభుత్వం పోయిన నాలుగు నెలల్లోనే తెలంగాణ రాష్ట్రంలో వ్యవసాయ సంక్షోభం వచ్చిందని, ఇలాంటి పరిస్థితిని తాము ఊహించలేదని కేటీఆర్ అసహనం వ్యక్తం చేశారు. రైతులకు 500 రూపాయల బోనస్ ఇవ్వమని అడిగితే ఎలక్షన్ కోడ్ ఉందని చెబుతున్నారని, చిత్తశుద్ధి ఉంటే ఎలక్షన్ కమిషన్ కు లెటర్ రాయాలని అన్నారు . రేవంత్ రెడ్డి గుంపు మేస్త్రి, ప్రధాని తాపీ మేస్త్రి అంటూ సెటైర్లు వేశారు.

పాలిచ్చే బర్రెను వదులుకొని దున్నపోతును తెచ్చుకున్నారు
కాంగ్రెస్ ప్రభుత్వం కాళేశ్వరం లో రెండు పిల్లర్లు రిపేర్ చేస్తే తెలంగాణలో కరువు రానే రాదని పేర్కొన్నారు. ప్రజలపై ప్రేమ ఉంటే ఇచ్చిన హామీలను రేవంత్ రెడ్డి నెరవేర్చాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ హామీలు నమ్మి ప్రజలు మోసపోయారని పాలిచ్చే బర్రెను వదులుకొని దున్నపోతును తెచ్చుకున్నామని ప్రజలు ఆవేదనలో ఉన్నారన్నారు.
ఇది కాలం తెచ్చిన కరువు కాదు కాంగ్రెస్ పార్టీ తెచ్చిన కరువు
ఎన్నికలకు ముందు రైతుబంధు కోసం ఏడు వేల కోట్ల రూపాయలు సిద్ధంగా పెట్టామని, ఆ డబ్బులు ఏమయ్యాయో చెప్పాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. కరువు రాకుండా ఉండాలనే రాష్ట్రంలో కాళేశ్వరం ప్రాజెక్టును కట్టామని, దానిమీద రాజకీయాలు చేసి రైతులకు నీళ్లు లేకుండా చేస్తున్నారని కేటీఆర్ మండిపడ్డారు. ఇది కాలం తెచ్చిన కరువు కాదు కాంగ్రెస్ పార్టీ తెచ్చిన కరువు అని నిప్పులు చెరిగారు .
కాంగ్రెస్ పార్టీ 420 హామీలతో ప్రజలను మోసం చేసింది
ఎర్రటి ఎండలో కేసీఆర్ రైతుల దగ్గరికి వెళ్లి భరోసా ఇస్తే, రేవంత్ రెడ్డి మాత్రం ఐపీఎల్ మ్యాచ్ లు చూస్తూ ఎంజాయ్ చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రేపటి నుంచి రైతుల హక్కుల కోసం పోరాటం చేద్దాం అన్నారు. మిషన్ భగీరథ అప్పగించిన నీళ్లు ఇచ్చే తెలివి కాంగ్రెస్ పార్టీకి లేదని, అన్నం వండి అప్పగించిన వడ్డించే తెలివిలేని పార్టీ కాంగ్రెస్ పార్టీ అని మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీ 420 హామీలతో ప్రజలను మోసం చేసిందని నిప్పులు చెరిగారు.












Click it and Unblock the Notifications